‘ఇది దిశ బయోపిక్‌ కాదు.. నిజాలు చెప్తున్నాం’

10 Oct, 2020 16:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినిమాను సినిమా లాగా మాత్రమే చూడాలని ‘దిశ.. ఎన్‌కౌంటర్‌’ చిత్ర నిర్మాత నట్టి కుమార్ అన్నారు. చట్టాలకు లోబడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఎవరి మనోభావాలను కించపరచే విధంగా సినిమా తీయడం లేదని చెప్పారు. దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న సినిమాను ఆపేలా సెన్సార్‌ బోర్డును కేంద్రప్రభుత్వం ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నట్టికుమార్‌ స్పందించారు. దిశ బయోపిక్‌ని తీయడం లేదని, మహిళ లపై జరుగుతున్న అత్యాచారాలు మళ్లీ జరగకూడదని చట్టానికి, న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. 
(చదవండి: ట్విటర్‌ వేదికగా ట్రైలర్‌ విడుదల చేసిన ఆర్జీవీ)

దిశ తల్లిదండ్రులు తమను సంప్రదించలేదని చెప్పారు. నవంబర్ 26న ‘దిశ.. ఎన్ కౌంటర్’  సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు. సెన్సార్ బోర్డు ఇంకా మాకు ఎలాంటి సర్టిఫికేట్‌ ఇవ్వలేదని నట్టికుమార్‌ వెల్లడించారు. దిశ కమిషన్‌కు సంబంధించిన విషయాలను సినిమాలో ఎక్కడా  చెప్పలేదని పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా ఈ చిత్రంలో చూపించామమని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా నిడివి గంటా 50 నిముషాలు ఉంటుందని తెలిపారు. ఇక సోషల్‌ మీడియాలో పోకిరీలు పెట్టే కామెంట్స్‌పై స్పందించలేమని అన్నారు. సైబర్ నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నట్టికుమార్‌ కోరారు. దిశ చిత్రంపై పూర్తి వివరాలను వర్మ త్వరలో వెల్లడిస్తారని తెలిపారు.
(చదవండి: ‘దిశ’ ఘటనపై వర్మ సినిమా ఆపండి)

మరిన్ని వార్తలు