డ్రగ్స్‌ వాడొద్దని రియా చెప్పింది. అయినా: లాయర్‌

4 Nov, 2020 19:52 IST|Sakshi

‘‘సుశాంత్‌ రాజ్‌పుత్‌ సింగ్‌ ముంబైలో ఐదుగురు డాక్టర్లను సంప్రదించాడు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారంతా అతడికి సూచించారు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఇలాంటి వ్యసనాలు వీడితే బాగుంటుందని చెప్పారు. రియా కూడా అతడికి ఇదే మాట చెప్పింది. డాక్టర్ల మాట వినమని సూచించింది. కానీ అతడు అందుకు తిరస్కరించాడు. సుశాంత్‌ తీరు రియాను అతడి ఇంటిని వీడేలా చేసింది. అతడి కోరిక మేరకే రియా ఈ పని చేసింది’’ అంటూ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ సింగ్‌ మృతికేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి లాయర్‌ సతీశ్‌ మనేషిండే కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా ఈ ఏడాది జూన్‌ 14న సుశాంత్‌ ముంబైలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ క్రమంలో అతడి కుటుంబం, సుశాంత్‌ ప్రేయసి రియా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌పై రియా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక సూచించిన మందుల కారణంగానే అతడు మృతి చెందాడని, ఈ విషయంపై సీబీఐ కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని రియా కోరింది. ఇదిలా ఉండగా.. సుశాంత్‌ మృతి కేసులో ముంబై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రియాంకతో పాటు ఆమె సోదరి మీతూ సింగ్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బాంబే హైకోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసిన పోలీసులు, సుశాంత్‌ సోదరీమణుల పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోరారు. (చదవండి: డ్రగ్స్‌ కేసు: ఎన్‌సీబీకి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు)

అంతేగాకుండా రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకే వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామాల గురించి సతీశ్‌ మనేషిండే మాట్లాడుతూ.. ‘‘రియా చక్రవర్తి చెప్పిన అంశాల ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నిజానికి వైద్యులను సంప్రదించకుండా, ప్రిస్కిప్షన్‌ను ఫోర్జరీ చేయడం చట్టవిరుద్ధం. ప్రియాంక తన సోదరుడికి సూచించిన మందుల విషయం గురించి జూన్‌8 నాటి మెసేజ్‌లలో స్పష్టంగా కనబడుతోంది. సుశాంత్‌ డ్రగ్స్‌కు బానిసగా మారాడని, డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాడని తెలిసి కూడా ఆ కుటుంబం ఇలా చేసింది’’అని ఆరోపణలు గుప్పించారు.

మరిన్ని వార్తలు