Richa Chadha: గల్వాన్‌ ట్వీట్‌ దుమారం.. సైన్యానికి సారీ చెప్పిన నటి

24 Nov, 2022 19:33 IST|Sakshi

బాలీవుడ్‌ నటి రిచా చద్దా చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది. భారత ఆర్మీని కించపరిచేలా మాట్లాడిదంటూ నటిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతలు సైతం ఆమె తీరును ఎండగడుతున్నారు. ఫిలిం మేకర్‌ అశోక్‌ పండిట్‌ అయితే ఓఅడుగు ముందుకేసి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఈ వివాదానికి కారణమేంటి? అసలేం జరిగిందో చూద్దాం..

'పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను తిరిగి మన స్వాధీనంలోకి తీసుకొచ్చేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. మీరు సరే అంటే వెంటనే ఆపరేషన్‌ పూర్తి చేస్తాం. కానీ ఈలోపు పాకిస్తాన్‌ కాల్పులు ఉల్లంఘనకు దిగితే మా సమాధానం ఇంకోలా ఉంటుంది. దాన్ని వారు కలలో కూడా ఊహించలేరు!' అని నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది బుధవారం ఓ ట్వీట్‌ చేశారు.

దీనిపై బాలీవుడ్‌ నటి రిచా చద్ధా స్పందిస్తూ 'గల్వాన్‌ సేస్‌ హాయ్‌' అని రిప్లై ఇచ్చింది. ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటో తెలీదు కానీ గల్వాన్‌ ఘటనను గుర్తు చేయడం మాత్రం నెటిజన్లకు కోపం తెప్పించింది. సైన్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిందంటూ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రిచా చద్ధా తన ట్వీట్‌ను తొలగించి అందరినీ క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్‌ చేసింది.

'నా వల్ల బాధపడ్డ అందరికీ క్షమాపణలు చెప్తున్నా. కానీ నా ఉద్దేశం అది కానే కాదు. నా అన్నయ్య ఆర్మీలోనే పని చేస్తాడు. మామయ్య పారాట్రూపర్‌. దేశాన్ని కాపాడే క్రమంలో సైనికుడు గాయపడ్డా, అమరుడైనా అతడి కుటుంబమంతా ఎంతో మనోవేదనకు గురి అవుతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా సొంత నానాజీ లెఫ్టినెంట్‌ కల్నల్‌గా భారత ఆర్మీకి సేవలందించారు. 1960లో జరిగిన ఇండో - చైనా యుద్ధంలో ఆయన కాలికి బుల్లెట్‌ తగిలింది. ఆర్మీపై గౌరవం నా రక్తంలోనే ఉంది' అని రిచా రాసుకొచ్చింది.

ఇకపోతే 2020లో గల్వాన్‌ నది లోయలో భారత్‌-చైనా సైన్యాల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులవగా చైనా 38 మంది సైనికులను కోల్పోయినట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది.

చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్‌, కీర్తి కోసం ఎవరు వచ్చారంటే?
ఆస్పత్రిలో కమల్‌ హాసన్‌, హెల్త్‌ బులెటిన్‌ విడుదల

మరిన్ని వార్తలు