Rishab Shetty : 'కాంతారా.. ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు'

16 Oct, 2022 08:49 IST|Sakshi

తమిళసినిమా: కన్నడంలో కేజీఎఫ్, విక్రాంత్‌ రోనా తరువాత సంచలన విజయాన్ని సాధించిన చిత్రం కాంతారా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు పాన్‌ ఇండియా రేంజ్‌కి చేరుకుంది. కేజీఎఫ్‌ 1, 2 చిత్రాలను నిర్మించిన హోమ్‌ బలి ఫిలిం సంస్థ నిర్మించింది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం తమిళంలోకి అనువాదమై శనివారం విడుదలైంది. దీనిని తమిళంలో డ్రీమ్‌ వారియర్‌ సంస్థ విడుదల చేసింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక నటుడు రిషబ్‌ శెట్టి శనివారం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. కాంతారా దర్శకుడిగా తనకు నాలుగవ చిత్రం అని, కథానాయకుడిగా రెండవదని చెప్పారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని దీంతో తన ఆలోచనలన్నీ ప్రకృతి, ప్రజలు, దైవం చుట్టునే తిరుగుతాయని చెప్పారు. ఈ మూడు అంశాలను కనెక్ట్‌ అయ్యేలా కథలు సిద్ధం చేసుకుని రూపొందించిన చిత్రం కాంతారా అని తెలిపారు.

చిత్రం హిట్‌ అవుతుందని భావించాను గానీ.. ఇంత ఘన విజయం సాధిస్తుందని, పాన్‌ ఇండియా చిత్రంగా మారుతుందని ఊహించలేదన్నారు. అయితే కన్నడంలో ఇంతకుముందే పలు పాన్‌ ఇండియా చిత్రాలు రూపొందాయి. అయితే అప్పట్లో ఆప్షన్స్‌ లేకపోవడంతో ఇతర భాషల్లో ఎక్కువ చిత్రాలు విడుదల కాలేకపోయాయని చెప్పారు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్‌ లాంటి నటులు, పలువురు లెజెండ్రీ దర్శకులు చేసిన చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధించాయన్నారు. రాజ్‌కుమార్‌ నటించిన మహిషాసుర మర్ధన తొలి పాన్‌ ఇండియా చిత్రమని రిషబ్‌శెట్టి పేర్కొన్నారు. ఆ చిత్రం అన్ని భాషల్లోనూ విడుదలై విజయం సాధించిందని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు