యోధురాలైన బామ్మ.. గొప్ప కథ: రితేశ్‌

24 Jul, 2020 08:25 IST|Sakshi

ఎంతటి కష్టం వచ్చినా ఆత్మాభిమానాన్ని వదులుకోకుండా సొంత కాళ్లపైనే నిలబడాలనుకునే వాళ్లు ఈ ప్రపంచంలో కొంత మందే ఉంటారు. పుణెకు చెందిన శాంతాబాయి పవార్‌ కూడా ఈ కోవకే చెందుతారు. ఎనిమిది పదుల వయసులోనూ శక్తిని కూడదీసుకుని తనకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నారు. రోడ్ల మీద కర్రతో విన్యాసాలు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ కాలంలోనూ ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఈ సూపర్‌ బామ్మకు సంబంధించిన వీడియోను బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘యోధురాలైన ఈ బామ్మ వివరాలు ఇవ్వగలరా’’అంటూ తన ఫాలోవర్లను అడిగారు.(సంపదలో పేదవాడు.. గుణంలో ధనవంతుడు)

ఇందుకు స్పందించిన నెటిజన్లు.. శాంతాబాయికి సంబంధించిన వివరాలను రితేశ్‌కు తెలియజేశారు. అదే విధంగా గతంలో తాము ఆమెకు సహాయపడిన తీరును వివరిస్తూ ఫొటోలు చేశారు. ‘‘తన కాళ్ల మీద తాను నిలబడుతూ.. ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్న ఈ బామ్మకు సెల్యూట్‌’’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక శాంతాబాయి వివరాలు తెలియడంతో తన టీం ఆమెను కలిసేందుకు వెళ్లిందని.. ఆమెది చాలా గొప్ప కథ అంటూ రితేశ్‌ తన ఫాలోవర్లకు ధన్యవాదాలు తెలిపారు.(‘శభాష్‌ పోలీస్‌’.. నెటిజన్ల ప్రశంసలు)

 
 

మరిన్ని వార్తలు