RK Roja: నాకు ఫైబ్రాయిడ్‌ ఉంది, పిల్లలు పుట్టే ఛాన్స్‌ లేదని డాక్టర్లు చెప్పారు

8 Mar, 2023 14:45 IST|Sakshi

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించిన ఆర్కే రోజా ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా కొనసాగుతున్నారు. మంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్న ఆమె మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. 'ఫ్యామిలీ విషయాల్లో నేను చాలా ఎమోషనల్‌. ఎందుకంటే నాకు ఫైబ్రాయిడ్‌ ఉంది. పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. తర్వాత 2000 సంవత్సరంలో లాప్రోస్క్రోపీ జరిగింది.

లాప్రోస్క్రోపీ జరిగిన రెండేళ్లకు (2002లో) పెళ్లయింది. 2003లో నాకు పాప పుట్టింది. అయితే గర్భం దాల్చగానే ఆ విషయాన్ని మా డాక్టర్‌కు చెప్పాను. ఆమె ఎగిరి గంతేసింది. నీ ప్రార్థనలు భగవంతుడు విన్నాడు, అందుకే నిన్ను కరుణించాడని సంతోషించింది. అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనుకుంటున్న సమయంలో తను నా కడుపున పుట్టింది. అందుకే నాకు పాపంటే ప్రాణం..  నా ఇద్దరు పిల్లలకు వారికి నచ్చినట్లే వారి జీవితాలు ఉండాలనుకుంటాను' అని చెప్తూ ఎమోషనలయ్యారు.

కాగా రోజా 1972 నవంబర్‌ 17న జన్మించారు. నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీపట్టా అందుకున్నారు. మరోవైపు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. బీఎస్‌సీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న సమయంలో ప్రేమ తపస్సు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. దానికంటే ముందు తమిళంలో చంబరతిలో నటించారు. ఆ సినిమా తెలుగులో చేమంతి కింద డబ్‌ అయింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన ఆర్కే సెల్వమణితో ప్రేమలో పడగా పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరికి కుమార్తె అన్షుమాలిక, కొడుకు కృష్ణ కౌశిక్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు