ఆ గళంలో...నాగలి

5 Aug, 2020 07:44 IST|Sakshi

ర్యాప్‌ సింగర్‌గా సుపరిచితుడైన రోల్‌రైడా బిగ్‌బాస్‌ సీజన్‌–2తో అందరికీ మరింత దగ్గరయ్యాడు...! ఎన్నో ర్యాప్, హిప్‌హాప్‌ పాటలతో శ్రోతలను అలరించిన రైడా, ర్యాప్‌ సాంగ్స్‌కి సందేశాత్మకతను జోడించి ప్రత్యేకమైన మార్క్‌ను ఏర్పరచుకున్నాడు. సామాజిక అంశాలను ముడిసరుకుగా తీసుకొని ఆల్బమ్స్‌ చేసే రోల్‌రైడా..,  ఈ సారి రైతుల కథాంశంతో  సమస్త మానవాళికి రైతే ఫ్రంట్‌వారియర్‌ అంటూ ‘నాగలి’ ర్యాప్‌తో వస్తున్నాడు...! 

సాక్షి,సిటీబ్యూరో: మ్యూజిక్‌లో ర్యాప్‌ సాంగ్స్‌ అనేవి విభిన్నమైనవి. అంతర్జాతీయంగా దానికంటూ ప్రత్యేకంగా మ్యుజిషియన్స్‌ ఉన్నారు. ఎన్నో పాశ్చాత్య సంగీత శైలుల్ని అందిపుచ్చుకోగలిగినా.. తెలుగులో ర్యాప్‌సింగర్స్‌ మాత్రం కొందరే ఉన్నారు. ఈ నేపథ్యంలో  తనకంటూ ప్రత్యేకించిన ర్యాప్‌ పాటలతో యూట్యూబ్‌లో బాగా ఫేమస్‌ అయ్యాడు రోల్‌రైడా.  

‘అరుపు’..ఓ పిలుపు... 
 విభిన్నమైన కాన్సెప్టులతో పలు ర్యాప్, హిప్‌హప్‌ సాంగ్స్‌ చేశాడు రైడా. ముఖ్యంగా మహిళలపైన, చిన్నారులపైన జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను ప్రతిస్పందిస్తూ ‘అరుపు’ పేరుతో  చేసిన ర్యాప్‌సాంగ్‌ విశేషమైన ఆదరణ పొంది కోట్ల సంఖ్యలో వీక్షకుల్ని సొంతం చేసుకుని, ఎంతోమందిని ఆలోచింపజేసింది.  అతిసున్నితమైన అంశాలని హృదయానికి హత్తుకునేలా మ్యూజిక్‌ని, సాంగ్‌ వెర్షన్‌ని రోల్‌రైడా ఎంచుకుంటాడు.  రైడా ర్యాప్‌ సింగర్‌ మాత్రమే కాకుండా మంచి రైటర్‌ కూడా. తన ర్యాప్స్‌తో సినిమాల్లో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రముఖ టాలివుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ల కోసం పలు సినిమాలకి సైతం ర్యాప్‌ సాంగ్స్‌ పాడాడు.  

రైతులే ఫ్రంట్‌వారియర్స్‌... 
కరోనా లాక్‌డౌన్‌లో ప్రపంచ జీవన విధానమే మారిపోయింది. కానీ మనిషి ఆకలి మాత్రం మారలేదు. ఏది లేకపోయినా సర్దుకున్నాం కానీ ఆకలికి ఓర్చుకోలేకపోయాం. ‘‘ఆహారం లేకపోతే మనిషికి  మనుగడే లేదు. మనిషికి అంత ముఖ్యమైన ఆహారాన్ని, అదీ మట్టి నుండి  పండిస్తున్న∙రైతుకు మాత్రం సానుభూతి తప్ప తగినంత గుర్తింపు రాలేదు’’ అంటున్నాడు రైడా. గుర్తింపు అటుంచితే సగటు మనిషి సామాజిక, ఆర్థిక జీవనానికి ఎంతో దూరంలో బ్రతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. అసలు రైతే లేకుంటే ఏంటి పరిస్థితి., రైతుకు కోపమొస్తే ఏం జరుగుతుంది అనే ఆలోచనతోనే  ‘నాగలి’ని రూపొందించానన్నారు. ‘‘ఇది ‘అరుపు టీం’ నుండి వస్తున్న మరో సందేశాత్మక ప్రయోగం. సమాజానికి రైతులే ఫ్రంట్‌వారియర్స్‌ అని, వారి స్థితిగతులను, మానవీయ కోనాలను, మానసిక వేదనలను ఇందులో పొందుపరిచామని’’ రైడా  తెలిపారు. ఈ ‘నాగలి’లో రైడాతో పాటు బిగ్‌బాస్‌లో అలరించిన ‘అమిత్‌ తివారి’ కూడా లీడ్‌రోల్‌గా చేశాడు. దీనికి రైడా లిరిక్స్‌ రాసి, ర్యాప్‌ పాడగా హరికాంత్‌ దర్శకత్వం చేశాడు. దీనంతటికి ఆత్మ అయినటువంటి మ్యూజిక్‌ని ప్రవీణ్‌ లక్కరాజు సమకూర్చాడు. నాగలి ట్రైలర్‌ని శనివారం రిలీజ్‌ చేయగా.., ఈ ర్యాప్‌సాంగ్‌ని స్వాతంత్ర దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల కోసం రిలీజ్‌ చేయనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తుందని రైడా చెప్పారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు