పూరి జగన్నాథ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్‌

25 Oct, 2021 08:08 IST|Sakshi

‘‘మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే ‘రొమాంటిక్‌’. ఇందులో మంచి భావోద్వేగాలు ఉంటాయి. ఇది కేవలం యూత్‌ సినిమానే కాదు.. కుటుంబ ప్రేక్షకులూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ అనిల్‌ పాదూరి అన్నారు. ఆకాశ్‌ పూరి, కేతిక శర్మ జంటగా రమ్యకృష్ట ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్‌ పాదూరి విలేకరులతో మాట్లాడుతూ–‘‘దర్శకుడు అవ్వాలనే ఆలోచన నాలో రేకెత్తించింది పూరి జగన్నాథ్‌గారే. ‘రొమాంటిక్‌’ కథని డైరెక్ట్‌ చేయమని చెప్పారు పూరిగారు. ‘రొమాంటిక్‌’ కథ, మాటలు ఆయన రాసినా సినిమాలో నా మార్క్‌ కనిపిస్తుంది. ప్రేమను నమ్మని ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ. ఈ పాత్రకు ఆకాశ్‌ వంద శాతం న్యాయం చేశాడు.

‘రొమాంటిక్‌’ ఫస్ట్‌ కాపీ చూసిన పూరిగారు కన్నీళ్లు పెట్టుకుంటూ, ‘నా సినిమాలో ఇంత ఎమోషన్‌ ఉందా?. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో ఎమోషన్‌ ఉంది.. ‘రొమాంటిక్‌’ లో అంత కంటే ఎక్కువగా ఉంది.. సినిమా బాగా తీశావ్‌..  నీకు మంచి భవిష్యత్తు ఉంది’ అని మెచ్చుకున్నారు. నా తర్వాతి చిత్రం యన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్‌లోనే చేస్తాను’’ అన్నారు.    

చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నటుడు కన్నుమూత

మరిన్ని వార్తలు