Room No 54: 'రూమ్‌ నంబర్‌ 54' వెబ్‌ సిరీస్‌ రివ్యూ

24 May, 2021 02:54 IST|Sakshi

రివ్యూ టైమ్‌

రీస్‌: ‘రూమ్‌ నంబర్‌ 54’;
సంగీతం: ధ్రువన్‌;
మేరా: ప్రణవ్‌ – శశాంక్‌;  
సమర్పణ: తరుణ్‌ భాస్కర్‌;  
నిర్మాత: చిన్నా వాసుదేవరెడ్డి;
రచన – దర్శకత్వం: సిద్ధార్థ్‌ గౌతమ్‌;
ఓటీటీ: జీ 5

కాలేజీ రోజులు ఎవరికైనా తీపి జ్ఞాపకాలే. అవి ఏ తెర మీదైనా మంచి బాక్సాఫీస్‌ సరుకులే. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల నుంచి శేఖర్‌ కమ్ముల ‘హ్యాపీడేస్‌’ దాకా బోలెడు చూశాం. ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌ నేపథ్యంలో రూపొందిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘రూమ్‌ నంబర్‌ 54’. ప్రముఖ దర్శకుడు ‘పెళ్ళిచూపులు’ ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ దీన్ని సమర్పించడం అందరిలో ఆసక్తి రేపింది. 


కథేమిటంటే..:  ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌లో పేరు పడ్డ స్పెషల్‌ గది– రూమ్‌ నం. 54. సువిశాలమైన ఆ రూమ్‌ స్టూడెంట్స్‌ అందరికీ ఓ జ్ఞాపకాల గని. కొత్తగా 2021లో అక్కడ చేరడానికి ఒకరికి ముగ్గురు కుర్రాళ్ళు ఒకరి తరువాత మరొకరు వస్తారు. వార్డెన్‌ ఆ కుర్రాళ్ళకు చెప్పే 2002 బ్యాచ్‌ కబుర్లే ఈ సిరీస్‌. ఆ పాత బ్యాచ్‌లో ఆ రూమ్‌లో గడిపిన నలుగురు కుర్రాళ్ళ కథ ఇది. ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘ఎరోటికాకూ... బూతుకూ తేడా’ ఉందనే బాబాయ్‌ (కృష్ణతేజ)కేమో సినీ దర్శకుడు కావాలని కోరిక. సన్నగా, మెతకగా ఉండే ప్రసన్న (పవన్‌ రమేశ్‌)ది కాలేజీలో సావిత్రితో ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీ. పేమెంట్‌ సీటు కుర్రాళ్ళయిన వెంకట్రావ్‌ (మొయిన్‌) ప్రతిదీ తేలికగా తీసుకొనే రకం. పదబంధాలు పూర్తి చేసే యువరాజ్‌ (కృష్ణప్రసాద్‌) మరో రకం. పరీక్షల్లో, ప్రేమలో, అవి ఇంట్లో వాళ్ళకు చెప్పడంలో– ఫెయిలైనవాళ్ళ హాస్టల్‌ జీవితమే ఈ సిరీస్‌.


ఎలా చేశారంటే..:  నటీనటులెవరూ సుపరిచితులు కారు. అయితేనేం, ‘రూమ్‌..’లోని నలుగురు కుర్రాళ్ళూ సహజంగా చేశారు. మరీ ముఖ్యంగా బాబాయిగా వేసిన కృష్ణతేజ, వెంకట్రావుగా వేసిన మొయిన్, ప్రసన్నగా చేసిన పవన్‌ రమేశ్‌లతో ప్రేమలో పడిపోతాం. వార్డెన్‌ పాత్రధారికి కూడా మంచి మార్కులు పడతాయి. వీళ్ళ నటన, ఫన్నీ సంగతులు, డైలాగ్స్‌ ఈ సిరీస్‌కు ప్రధాన బలం. 


ఎలా తీశారంటే..: అతి పరిమిత బడ్జెట్‌లో, ఫలితంగా పరిమితమైన నిర్మాణ విలువలతో ఈ సిరీస్‌ రూపొందింది. కథలో పాత్రలు తక్కువే. అలాగే హాస్టల్‌లో ఆ ఒక్క గది, టీ షాపు, జ్యూస్‌ షాపు – ఇలా లొకేషన్లూ తక్కువే. హాస్టల్‌లోనూ, కాలేజీలోనూ వీళ్ళు తప్ప మరెవరూ లేరా అనీ అనిపిస్తుంది. ఇవన్నీ వీక్షణాసక్తిపై ప్రభావం చూపడం సహజం. టైటిల్‌ ట్రాక్‌ బాగుంది. కానీ, నేపథ్య సంగీతం, టేకింగ్‌లు పాత సీరియల్స్‌ స్థాయిని దాటి బయటకొస్తే బాగుండేది. ఈ సిరీస్‌లో ప్రధానంగా చూపేదంతా 2002 బ్యాచ్‌లోని నలుగురు పాత స్టూడెంట్స్‌ జీవితం. కానీ, ఎస్టీడీ బూత్‌ల 2002 నాటికీ, స్మార్ట్‌ ఫోన్ల 2021 నాటికీ స్టూడెంట్స్‌ ప్రవర్తన, సామాజిక పరిస్థితులు ఒకేలా ఉన్నట్టు కథలో చూపడమే విచిత్రంగా అనిపిస్తుంది. 


ఎవరి వద్దా పనిచేయని దర్శక, రచయిత కావడంతో కొన్ని లోటుపాట్లు అర్థం చేసుకోదగినవే. మొదటంతా అల్లరి చిల్లరిగా చూపించినా, చివరి ఎపిసోడ్లలో పాపులర్‌ గెస్ట్‌రోల్స్‌ ద్వారా వాళ్ళకు జీవిత పాఠాలు చెప్పేయత్నం హడావిడిగా చేశారు. ప్రధాన పాత్రల సహజమైన నటన, ఒక్కో పాత్రకు ఒక్కో రకమైన వ్యక్తిత్వ చిత్రణ, భంగు ఉండలు తినడం లాంటి కొన్ని ఘటనలు, నవ్వించే డైలాగులు ఆకర్షిస్తాయి. 


కాలేజీ లైఫులో కచ్చితంగా మెరుపులుంటాయి కానీ, ఆట్టే కథ లేకుండా పది ఎపిసోడ్లు తీయడం సాహసం. అందుకే, ఈ ‘రూమ్‌...’ అనుభవాలు అక్కడక్కడే తిరుగుతూ, కాసేపయ్యాక బోరెత్తిస్తాయి. ప్రతి ఎపిసోడ్‌ చివరలో గతంలో ఆ రూమ్‌లో ఉన్న ఎవరో ఒక సీనియర్‌ బ్యాచ్‌ వ్యక్తి వచ్చి మాట్లాడతారు. అలా ప్రియదర్శి, సత్యదేవ్, ఉత్తేజ్‌ లాంటి పలువురు గెస్ట్‌ రోల్స్‌లో కనిపిస్తారు. తొలుత తియ్యగా ఉన్నా, పదిసార్లనే సరికి తీపి అతి అయింది. ఆఖరి ఎపిసోడ్‌లో మెరిసే తనికెళ్ళ భరణి ‘జీవితం జారుముడిలా ఉండాలి... విప్పేయడానికి వీలుగా’ లాంటి మాటలు మనసును తాకుతాయి. పరీక్షలు పాసై, బయటకెళ్ళాక బౌన్సర్లు విసిరే సొసైటీలో రోజూ పరీక్షలే అనే ఎరుక కలిగిస్తాయి. తనికెళ్ళ ద్వారా ఆ గది నుంచి బాహ్యప్రపంచానికి దారి తీసే తాళం చెవి ఏదో కథలోని పాత్రలకూ, వీక్షకులకూ దొరికినట్టవుతుంది. ఖాళీగా ఉంటే... కాసేపు పాత హాస్టల్‌ సంగతులు నెమరు వేసుకోవడానికి ఈ ‘రూమ్‌...’ పనికొస్తుంది.


కొసమెరుపు:  కాసిన్ని నవ్వులున్నా... కథ లేదు!     

బలాలు: కొన్ని హాస్టల్‌ సంఘటనలు
♦సహజమైన నటన, డైలాగులు
♦పాపులర్‌ నటుల గెస్ట్‌ రోల్స్‌

బలహీనతలు: ∙అనుభవాలే కథ అని పొరపడడం
♦పరిమిత వనరులు, నిర్మాణ విలువలు
♦సుదీర్ఘంగా 10 ఎపిసోడ్లకు సాగదీత
♦సీరియల్స్‌ తరహా టేకింగ్‌  

– రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు