Ram Charan: ఈ క్షణాల కోసమే ఎంతో కష్టపడ్డా.. ఈ వేదికపై తారక్‌ను మిస్‌ అవుతున్నా

3 Mar, 2023 18:17 IST|Sakshi

అంత‌ర్జాతీయ స్క్రీనింగ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌కు స్టాండింగ్ ఒవేష‌న్‌

ఇది జీవితాంతం గుర్తుండిపోతుంద‌న్న రామ్‌చ‌ర‌ణ్

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ వేడుక‌కు రామ్ చరణ్‌తో పాటు ఎస్‌ఎస్‌ రాజమౌళి, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్‌ కుమార్ హాజరయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్ర‌ద‌ర్శ‌న పూర్తైన వెంట‌నే యూనిట్ స‌భ్యుల‌ను థియేటర్‌లో చ‌ప్ప‌ట్ల‌తో గౌర‌వించారు. స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ప్రేక్ష‌కులు చూపించే ప్రేమ‌, అభిమానుల ఆద‌ర‌ణే త‌న‌ను కెరీర్‌లో సుదీర్ఘ‌ తీరాల‌కు న‌డిపిస్తుంద‌ని అన్నారు. మిగిలిన వాళ్ల‌కు కూడా ఇలాగే ఉంటుందా? లేదా నాకు మాత్రమే ఇలా ఉందో తెలియ‌దు. కానీ, నటుడిగా ఈ క్ష‌ణాల‌ను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ క్ష‌ణాల కోస‌మే ఎంత కష్టమైనా పడ్డాను. ప్రేక్షకులు అందరినీ ఎంటర్‌టైన్‌ చేయాలనేదే నా ప్ర‌య‌త్నం. ఇంత‌ ఆద‌రాభిమానాలు చూపిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు. ఇంత గొప్ప చిత్రంలో న‌న్ను భాగం చేసిన మా ద‌ర్శ‌కులు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి గారికి ఈ సంద‌ర్భంగా మరోసారి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను.

సింపుల్‌గా చెప్పాలంటే, మ‌గ‌ధీర స‌మయంలో నన్ను నేను విద్యార్థిగానే భావించాను. ట్రిపుల్ ఆర్ స‌మ‌యంలోనూ అలాగే అనుకున్నాను. ఇదేదో నేను స‌ర‌దా కోసం చెబుతున్న మాట కాదు. రాజ‌మౌళి గారు నాకు ప్రిన్సిప‌ల్, టీచ‌ర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గురువు లాంటి వారు. ఆయ‌న్ను క‌లిసిన ప్రతిసారి సినిమాకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటాను. ఆయనతో మాట్లాడితే మనకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. మ‌రో ప‌దేళ్లకు సరిపడా జ్ఞానం మనకు లభిస్తుంది' అన్నాడు. 

ఎన్టీఆర్ గురించి చ‌ర‌ణ్‌ మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను, తార‌క్ చాలా స‌న్నిహితంగా ఉంటున్నాం. అందుకు ట్రిపుల్ ఆర్‌కి ధ‌న్య‌వాదాలు. ట్రిపుల్ ఆర్ వ‌ల్ల మేం త‌ర‌చూ క‌లిసే వాళ్లం. చాలా స‌న్నిహితుల‌మ‌య్యాం. మ‌మ్మ‌ల్ని క‌ల‌పాల‌నే ఆలోచ‌న రాజ‌మౌళి గారికి క‌లిగిన‌ట్టుంది. అందుకే మ‌మ్మ‌ల్ని ఇద్ద‌రినీ ట్రిపుల్ ఆర్ కోసం తీసుకున్నారు. ట్రిపుల్ ఆర్‌లో తార‌క్ న‌టించ‌డం వ‌ల్ల సోద‌ర‌ భావాన్ని చూపించ‌డం తేలికైంది. త‌న‌తో క‌లివిడిగా ఉండ‌గ‌లిగాను' అన్నాడు. తార‌క్‌ని ఆ వేదిక మీద మిస్ అవుతున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు