‘ఆర్‌ఆర్‌ఆర్‌ ’హవా.. రికార్డు రేటుకి తమిళ్‌ రైట్స్‌

17 Feb, 2021 20:06 IST|Sakshi

తమిళనాడు థియేట్రికల్‌ హక్కులను దక్కించుకున్న లైకా ప్రొడెక్షన్స్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్).  భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం,  స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.. ఇప్పటికే ఫ్రీ రిలీజ్‌ బిజినెస్‌ని భారీగా జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం​ చేస్తూ బుధవారం ఓ కీలక ప్రకటన వెలువడింది.  

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తమిళనాడు థియేట్రికల్‌ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్‌ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడెక్షన్స్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. ‘బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ తమిళనాడు థియేట్రికల్ హక్కులను దక్కించుకుంచుకున్నామని ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది’అంటూ లైకా ప్రొడక్షన్స్‌ ట్విట్‌ చేసింది. అయితే ఈ థియేట్రికల్స్‌ రైట్స్‌ను పొందడం కోసం  లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.45 కోట్ల భారీ ధరకు తమిళనాడు థియేట్రికల్స్‌ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇంత మొత్తంలో చెల్లించడం పెద్ద ఆశ్యర్యకరమైన విషయమేమి కాదు. , రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’ తమిళనాడులో సుమారు రూ.78 కోట్ల షేర్ వసూలు చేసింది. అందుకే లైకా ప్రొడక్షన్స్‌ రూ. 45 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆర్‌ఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి రూ.45 కోట్లు వసూలు కావడం పెద్ద కష్టమేమీకాదు.

మరిన్ని వార్తలు