RRR Movie: 'ఆర్ఆర్ఆర్‌'లో అలరించే కీలక పాత్రధారులు వీరే..

24 Mar, 2022 16:53 IST|Sakshi

RRR Movie Main Key Characters: ప్రస్తుతం యావత్‌ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూసిన తరుణం సమీపించింది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్‌ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, యంగ్‌ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ నటనను వీక్షించేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్‌, సీతగా బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ అలియా భట్‌ అలరించనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌లో ఈ ఇద్దరే కాకుండా ఇతర కీలక పాత్రలు కూడా సందడి చేయనున్నాయి. ఆ పాత్రలేంటో చూద్దామా !

'ఆర్ఆర్ఆర్' చిత్రంలో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్నాడు. ఇందులో ఆయనది పవర్‌ఫుల్‌ రోల్‌ అని తెలుస్తోంది. 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్‌..', 'నేనంటేనే ఓ పోరాటం' అంటూ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం భార్యాబిడ్డల్ని వదిలి యుద్ధభూమిలోకి అడుగు పెట్టిన పోరాటయోధుడిగా అజయ్‌ దేవగన్‌ కనిపించనున్నారు. ఈ రోల్‌కు అజయ్‌ ఎలాంటి రెమ్మ్యునరేషన్‌ తీసుకోలేదని సమాచారం.

అజయ్‌ దేవగన్‌కు సతీమణిగా సరోజిని పాత్రలో అలరించనుందని స్టార్‌ హీరోయిన్‌ శ్రియ సరన్. 'ఛత్రపతి' తర్వాత రాజమౌళి సినిమాలో మళ్లీ కనిపిస్తోంది శ్రియ. భర్త అడుగుజాడల్లో పోరాటంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె పండించిన హావాభావాలు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యేలా ఉన్నాయి. 
 

పాన్‌ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్‌ నటుడు, డైరెక్టర్‌ సముద్రఖని నటించారు. ఇందులో ఆయన పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రలో రామ్‌చరణ్‌కు సన్నిహితుడిగా కనిపించనున్నట్లు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. బ్రిటీష్‌ వారికి ఎదురుతిరిగేందుకు చెర్రీ సిద్ధమవుతుండగా 'చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయిరా..' అని ఆయన ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్‌ మెప్పించింది.

ఇంకా ఈ మూవీలో రాజీవ్‌ కనకాల నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళికి ఆయనకు మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది. జక్కన్న తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీ రోల్‌ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ఎన్టీఆర్‌కు లవర్‌గా విదేశీ భామ ఒలివీయా మోరీస్‌ కొన్ని సన్నివేశాల్లో తళుక్కున మెరిసి ఆకట్టుకోనుంది. విలనిజంతో కూడకున్న పాత్రలో ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ నటించారు. లేడీ స్కాట్‌గా ఆమె తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కమెడియన్‌, నటుడు రాహుల్‌ రామకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్‌ వెంట ఉండే వ్యక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు