ఆర్‌ఆర్‌ఆర్‌: రాజమౌళి కాపీ కొట్టారట!

26 Jan, 2021 16:44 IST|Sakshi

సోషల్‌ మీడియా వచ్చాక సినిమా పబ్లిసిటీకి పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. కానీ సినిమా టైటిల్‌ నుంచి, పోస్టర్‌​ లుక్‌ వరకు ఏమాత్రం తేడా వచ్చినా నెటిజన్లు దాన్ని ఇట్టే పసిగట్టి టాంటాం చేస్తుంటారు. తాజాగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రణం రుధిరం) సినిమా పోస్టర్‌​ కూడా నెట్టింట తెగ రౌండ్లు కొడుతోంది. ఈ పోస్టర్‌లో హీరోలు రామ్‌చరణ్‌ గుర్రపు స్వారీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ బైక్‌ రైడింగ్‌ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఈ పోస్టర్‌ ఎక్కడో చూసినట్టుందేనని కొందరు అభిమానులు తలలు గోక్కున్నారు. చివరకు దొరికేసిందోచ్‌ అంటూ 2007లో రిలీజైన ఘోస్ట్‌ రైడర్‌ పోస్టర్‌ను ఇప్పటి ఆర్‌ఆర్‌​ఆర్‌ పోస్టర్‌తో పోలుస్తున్నారు. అందు‌లో ఓ ఘోస్ట్‌ రైడర్‌ గుర్రం స్వారీ చేస్తుండగా మరొకరు బైక్‌ రైడింగ్‌ చేస్తున్నారు. ఇందులో మండుతున్న నిప్పు ప్రత్యేక ఆకర్షణ. అచ్చంగా అలాంటి కాన్సెప్టే ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌లో ఉండటంతో రాజమౌళి మళ్లీ కాపీ కొట్టారంటూ కొందరు నెటిజన్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం కేవలం ఘోస్ట్‌ రైడర్‌ పోస్టర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారంటూ వెనకేసుకొస్తున్నారు. (చదవండి: తాండవ్‌ వివాదం.. నాలుక కోస్తే రూ. కోటి రివార్డు)

ఇక గతంలోనూ రామరాజు ఫర్‌ భీమ్‌ అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ వీడియో రిలీజ్‌ చేయగా అందులో చాలా సన్నిశాలు నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌ నుంచి తీసుకున్నారు. అగ్నిపర్వతం బద్ధలవ్వడం సహా ప్రకృతికి సంబంధించిన క్లిప్పింగులను ఆ ఛానల్‌ నుంచి సేకరించి ట్రిపుల్‌ ఆర్‌కు వాడుకున్నారు. ఆ సమయంలో కూడా కొందరు జక్కన్న ఐడియాను మెచ్చుకోగా అతి కొద్ది మంది మాత్రం కాపీ కొట్టారంటూ చురకలంటించారు. కాగా ఈ సినిమాలో గోండుల వీరుడు కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి అలియా భట్‌ హాలీవుడ్‌ నుంచి ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, అలిసన్ డూడీ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రం దసరా ప్రత్యేకంగా అక్టోబర్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది. (చదవండి: ఆర్ఆర్ఆర్‌: ఆ అగ్నిప‌ర్వ‌తం ఆ ఛాన‌ల్‌లోదే..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు