వీకెండ్‌ ధమాకా...మూడు భారీ సినిమాల క్రేజీ అప్‌డేట్స్‌

3 Oct, 2021 10:24 IST|Sakshi

సినిమా లవర్స్‌కి శనివారం మంచి వార్త ఇచ్చింది. మూడు సినిమాల విడుదల తేదీలను ప్రకటించి, వీకెండ్‌ ధమాకా ఇచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’, ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రాల విడుదల తేదీలు ఖరారు అయ్యాయి. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్‌ పీరియాడికల్‌ ప్యాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘రౌద్రం.. రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటించారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరకర్త. ఈ సినిమా విడుదల ఇప్పటికే మూడుసార్లు (2020 జూలై 30,  2021 జనవరి 8, 2021 అక్టోబరు 13) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదల ఎప్పుడు? అనే చర్చలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ, జనవరి 7న ఖరారు చేశామని చిత్రబృందం ప్రకటించింది.

ఇక పుష్పరాజ్‌ సైతం తన రాకను కన్ఫార్మ్‌ చేశాడు. క్రిస్మస్‌ పండగ సందర్భంగా డిసెంబరు 17న థియేటర్స్‌కు రానున్నట్లు తేల్చి చెప్పేశాడు. ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు వీళ్లిద్దరికంటే ముందే ‘ఆరడుగుల బుల్లెట్‌’లా థియేటర్స్‌లోకి దూసుకొస్తున్నారు గోపీచంద్‌. బి. గోపాల్‌ దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా తాండ్ర రమేష్‌ నిర్మించిన ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ మూడు సినిమాల విడుదల తేదీలే కాదు... రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు కొత్త విడుదల తేదీలను ప్రకటించడానికి రెడీ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు