RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ రాకతో సైడ్‌ అయిపోయిన సినిమాలు, ఎన్ని స్క్రీన్లలో రిలీజంటే?

25 Mar, 2022 07:58 IST|Sakshi

‘‘ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం... రా’’ అంటూ రామ్, భీమ్‌ చేసిన యుద్ధాన్ని తెరపై చూసే సమయం ఆసన్నమైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఈ యుద్ధాన్ని చూడటానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది వేల స్క్రీన్లకు పైగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌  నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం.. రణం.. రుధిరం).

రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ సినిమా కాబట్టి ఈ సినిమాతో పోటీ పడకుండా తెలుగుతో కలుపుకుని ఇతర భాషల్లో కూడా తమ చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నాయి పలు నిర్మాణ సంస్థలు. అంతెందుకు? దేశవ్యాప్తంగా చాలావరకూ ఎక్కువ స్క్రీన్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కనిపిస్తుంది. ఇక జంట నగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్‌) అయితే శుక్రవారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తప్ప వేరే సినిమా కనిపించదు. ఆ విశేషాల్లోకి వస్తే...

సింగిల్‌ 100... మల్టీప్లెక్స్‌ 40
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న థియేటర్లు ఎన్ని? అనే లెక్కలోకి వస్తే... సింగిల్‌ థియేటర్లు దాదాపు 100. మల్టీప్లెక్స్‌ దాదాపు 40 ప్రాపర్టీస్‌ (మల్టీప్లెక్స్‌లో పలు స్క్రీన్స్‌ ఉంటాయి కాబట్టి వీటిని ప్రాపర్టీస్‌ అంటారు). మామూలుగా ఏ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లో అయినా మినిమమ్‌ మూడు స్క్రీన్ల నుంచి మ్యాగ్జిమమ్‌ తొమ్మిది స్క్రీన్ల వరకూ ఉంటాయి. సో... టూకీగా ఒక్కో ప్రాపర్టీలో ఐదు స్క్రీన్లు ఉన్నాయనుకుందాం... అప్పుడు 40 ప్రాపర్టీస్‌లో 200 స్క్రీన్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలవుతుందనుకోవచ్చు. సో.. సింగిల్, మల్టీప్లెక్స్‌ కలుపుకుని దాదాపు 300 స్క్రీన్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆడుతుంది. మరి.. ఇప్పటివరకూ థియేటర్లలో ఉన్న సినిమాల సంగతేంటి?

రెండు మూడు స్క్రీన్లు మినహా...
గురువారం వరకూ ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’, ‘రాధే శ్యామ్‌’, ‘బచ్చన్‌ పాండే’, ‘జేమ్స్‌’తో పాటు హాలీవుడ్‌ ‘బ్యాట్‌ మేన్‌’ తదితర చిత్రాలు కొన్ని థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి. అయితే శుక్రవారం రెండు మూడు స్క్రీన్లు మినహా మిగతా అన్నింటిలోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దర్శనమిస్తుంది. ఎన్ని రోజుల పాటు ఇలా అన్ని స్క్రీన్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మాత్రమే ఉంటుంది అంటే..?

‘ద కశ్మీర్‌..’కి చాన్స్‌
జంట నగరాల్లో ఆడుతున్న ఆలియా భట్‌ ‘గంగూబాయి కతియావాడి’, ‘రాజ్‌ తరుణ్‌ ‘స్టాండప్‌ రాహుల్‌’ చిత్రాల ప్రదర్శన గురువారంతో ముగిసింది. అయితే ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’ శుక్రవారం ఒకట్రెండు స్క్రీన్లలో మాత్రమే కనిపించి, మళ్లీ సోమవారం నుంచి కాస్త ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, అక్షయ్‌ కుమార్‌ ‘బచ్చన్‌ పాండే’ వంటి రెండు మూడు చిత్రాలకూ స్కోప్‌ ఉంది.

అయితే ఈ రెండు మూడు సినిమాలూ జస్ట్‌ పదీ పదిహేను శాతం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శితమవుతాయని, మిగతా అన్ని స్క్రీన్లలోనూ ఓ వారం.. పది రోజులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉంటుందని జంట నగరాలకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్‌ పేర్కొన్నారు. ఆ పదిహేను  శాతంలో కూడా మల్టీప్లెక్స్‌ స్క్రీన్లే ఎక్కువని, అది కూడా ‘ద కశ్మీర్‌...’ సినిమా స్క్రీన్లే ఎక్కువ అని కూడా తెలిపారు. ‘‘ఆదివారం వరకూ ఎలానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వేరే సినిమాలకు ఎన్ని స్క్రీన్లు కేటాయించాలనేది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి వచ్చే స్పందన నిర్ణయిస్తుంది’’ అని ఓ డిస్ట్రిబ్యూటర్‌ అన్నారు.

3 గంటల 1 నిమిషం 53 సెకన్లు..
ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్‌ దేవగన్, సముద్ర ఖని, శ్రియ, రే స్టీవెన్‌సన్‌... ఇలా భారీ తారాగణంతో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రూపొందింది. కోవిడ్‌ బ్రేక్స్‌ నడుమ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపొందించిన ఈ సినిమా నిడివి ఎంత అంటే..  3 గంటల 1 నిమిషం 53 సెకన్లు. నిజానికి ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు అట. అయితే ముందు 1 నిమిషం 35 సెకన్ల నిడివిని తగ్గించారట. ఆ తర్వాత క్రెడిట్స్‌లో 3 నిమిషాల 26 సెకన్ల నిడివిని తగ్గించారని భోగట్టా. ఫైనల్‌గా ప్రేక్షకులు చూడనున్నది 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అని తెలిసింది.

చదవండి: RRR Movie: అందరిముందే అబద్ధాలు ఆడతాను: రాజమౌళి

మరిన్ని వార్తలు