ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి రేపు బిగ్ సర్ప్రైజ్!

5 Oct, 2020 18:28 IST|Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. అన్నీ కుదిరి ఉంటే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.  కానీ, కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో  షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ తప్ప ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. చాలా రోజుల తర్వాత నయా అప్‌డేట్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా వచ్చేసింది చిత్ర బృందం. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది.
(చదవండి : త్వరలో పెళ్లి పీటలెక్కనున్న కాజల్‌..!)

‘మన పండగలకు శుభాకాంక్షలు చెబుతూ మేము ప్రకటించే అప్‌డేట్‌ల కోసం మీ క్రియేటివిటీని ఉపయోగించి వ్యంగ్యంగా చేస్తున్న పోస్టులు ఇక చాలు. మీ ప్రేమతో మమ్మల్ని చంపుతున్నందుకు ధన్యవాదాలు. కాలం వేగంగా గడిచిపోయింది. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. ఇక మిమ్మల్ని అలరించడం మా వంతు. రేపటి వరకు వేచి ఉండండి’ అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ట్వీట్‌ చేసింది.

ఇప్పటికే రామ్‌చరణ్‌ లుక్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక రేపు కొమర్‌ భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ లుక్‌ను విడుదల చేస్తారా లేదా మరేదైనా కొత్త విషయాన్ని చెబుతారా తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే. #weRRRBack హాష్‌ట్యాగ్‌ను బట్టి చూస్తే సినిమా షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్‌ కుమార్‌ కెమెరామేన్‌.

మరిన్ని వార్తలు