RRR Movie: నాకు ఐరన్  మ్యాన్  అంటే ఇష్టం: జూనియర్ ఎన్టీఆర్

12 Jan, 2023 11:39 IST|Sakshi

టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ ‍అవార్డ్ దక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాటు నాటు సాంగ్‌ ఈ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డ్‌తో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్ బరిలోనూ నిలిచింది. తాజాగా ఈ అవార్డ్ దక్కటం పట్ల రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. 

 ఐరన్‌  మ్యాన్‌  అంటే  ఇష్టం – ఎన్టీఆర్‌

 జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతబ.. ‘రాజమౌళితో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్నప్పుడే ఈ సినిమా ఎక్కువమందికి రీచ్‌ అవుతుందని తెలుసు. ఆయనతో సినిమాలు చేయడం వల్ల, ఆయన ట్రాక్‌ రికార్డుని దృష్టిని పెట్టుకోవడం వల్ల తప్పకుండా మేం గెలుస్తామనే నమ్మకం ఏర్పడింది’’ అన్నారు ఎన్టీఆర్‌. మార్వెల్‌ సినిమాల గురించి మీడియా ప్రతినిధి అడిగితే... ‘‘మార్వెల్‌ సినిమా చేయాలని ఉంది. నా ఫ్యాన్స్ దీని గురించి క్రేజీగా మాట్లాడుకుంటున్నారు. నాకు ఐరన్  మ్యాన్  అంటే ఇష్టం. ఆ క్యారెక్టర్‌ మాకు దగ్గరగా అనిపిస్తుంది’’ అని అన్నారు. అది మాత్రమే కాదు.. ‘‘ఇవాళ మీ బర్త్‌డే కదూ.. హ్యాపీ బర్త్‌డే... మీకో చిన్న గిఫ్ట్‌. మీకు నచ్చుతుందనుకుంటున్నా’’ అంటూ ఓ గిఫ్ట్‌ని విలేకరికి అందజేశారు ఎన్టీఆర్‌. 

అది అందమైన టార్చర్‌ –  రామ్‌చరణ్‌

హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘మా టీమ్‌ కష్టమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. అదొక అందమైన టార్చర్‌. సౌత్‌ ఇండియా నుంచి సినిమాలకు ఎంతో పాపులర్‌ అయిన ఈ ప్రాంతానికి రావడం, ప్రశంసలు పొందడం మాకు ఎనర్జీని ఇచ్చే విషయం. నాకిష్టమైన ప్లేస్‌ ఇది. హాలిడే ట్రిప్స్‌కి వస్తుంటాను. ఈ 80వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌కి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు రామ్‌చరణ్‌. కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ‘మార్వెల్‌’ మూవీస్‌ని తలపించిందని, మీరు మార్వెల్‌ యాక్టర్‌లా కనిపించారని, మార్వెల్‌ స్టార్‌గా, సూపర్‌ హీరోగా చేయాలనుకుంటున్నారా? అని రామ్‌చరణ్‌ని ఓ విలేకరి అడగ్గా, ‘‘తప్పకుండా చేస్తాను. నా ఫేవరెట్‌ మార్వెల్‌ మూవీ ‘కెప్టెన్‌ అమెరికా’’ అన్నారు.

అవార్డు వేడుకకు ముందు రెడ్‌ కార్పెట్‌పై రామ్ చరణ్ మాట్లాడారు. ఇక్కడి టాప్‌ టెక్నీషియన్లతో పని చేయాలని ఉందని.. అలాగే ఇండియాలో సూపర్‌ హీరోలు ఉన్నారు. వారి నటనని ఇక్కడి దర్శకులు ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ మీ సినిమాకి అవార్డు వస్తే  ఏం చేస్తారని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా– ‘‘మా డైరెక్టర్‌ రాజమౌళిగారిని ఆ అవార్డుని నాకు ఇవ్వమని అడుగుతాను. కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకుని ఆ తర్వాత వెనక్కి ఇచ్చేస్తాను’. అని అన్నారు. 

మాటలు రావడం లేదు: రాజమౌళి

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. 'మాటలు రావడం లేదు. సంగీతానికి హద్దులు లేవు. నాకు ‘నాటు నాటు..’ లాంటి పాట ఇచ్చిన పెద్దన్నా (కీరవాణి) మీకు శుభాకాంక్షలు,  ధన్యవాదాలు. ఈ అవార్డు చాలా ప్రత్యేకమైనది. ‘నాటు నాటు...’ స్టెప్‌ వేస్తూ, ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ చేసిన ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు.' అని అన్నారు. 

>
మరిన్ని వార్తలు