Rudramkota Review: ‘రుద్రంకోట’ మూవీ రివ్యూ

22 Sep, 2023 18:04 IST|Sakshi
Rating:  

టైటిల్‌: రుద్రంకోట 
నటీనటుటు: జ‌య‌ల‌లిత‌, అనీల్‌, విభీష‌, అలేఖ్య‌ ,బాచి, రమ్య తదితరులు 
నిర్మాత:అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి  
దర్శకత్వం: రాము కోన
సంగీతం: సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్
నేపథ్య సంగీతం: కోటి
సినిమాటోగ్రఫీ: ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌
ఎడిటర్‌: ఆవుల వెంకటేష్‌
విడుదల తేది: సెప్టెంబర్‌ 22, 2023

రుద్రంకోట కథేంటంటే..
రుద్రంకోట ఊరిలో కోటమ్మ(సీనియర్‌ నటి జయలలిత)చెప్పిందే వేదం. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే.. స్త్రీలను కూడా శిక్ష విధిస్తుంది. ఆ ఊరికి కాపాలాగా రుద్ర(అనిల్‌ ఆర్కా కండవల్లి) ఉంటాడు. ఆయన కళ్లుగప్పి ఎవరూ ఊరు దాటలేరు. కోటమ్మ తప్ప మిగతా ఏ మహిళను కూడా రుద్ర కన్నెత్తి చూడడు. మాట్లాడడు. స్మశానంలోనే ఉంటూ ఊరికి కాపాలా కాస్తుంటాడు. అదే ఊరికి చెందిన శక్తి(విభీష)కు రుద్ర అంటే చచ్చేంత ప్రేమ. పట్నం నుంచి ఊరికి వచ్చిన కోటమ్మ మనవరాలు ధృతి(అలేఖ్య) రుద్రపై మోజు పడుతుంది. కానీ రుద్ర మాత్రం ధృతి కోరికను తిరస్కరిస్తాడు. ఇదిలా ఉంటే ఊరి చివర్లో కొంతమంది యువకులు ఓ అఘాయిత్యానికి పాల్పడతారు. అదేంటి? రుద్ర ప్రాణంగా ప్రేమించిన శక్తికి ఏం జరిగింది? అసలు రుద్ర నేపథ్యం ఏంటి? అమ్మాయిలంటే ఎందుకు గిట్టదు? శక్తి ప్రేమ సఫలం అయిందా లేదా? రుద్రపై పగ పెంచుకున్న ధృతి..చివరకు ఏం చేసింది? తప్పు చేసిన వాళ్లకు రుద్ర ఎలాంటి శిక్ష విధించాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమ‌కథా చిత్రమిది. ల‌వ్ అండ్ ల‌స్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాము కోన. కామంతో కొందరు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారనేది ఈ చిత్రంలో చూపించారు. అయితే ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ హీరో పాత్రను తీర్చి దిద్దిన తీరు బాగుంది.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగుంది కానీ.. దాని చుట్టు అల్లుకున్న కథలో మాత్రం బలం లేదు. కోటమ్మ పాత్ర పరిచయంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రుద్రగా హీరో ఎంట్రీ సీన్‌ బాగుంటుంది. ఎలాంటి సాగదీత లేకుండా మొదట్లోనే ముఖ్యమైన పాత్రలు..వాటి నేపథ్యాన్ని చూపించారు. దీంతో కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఆసక్తిని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనం నెమ్మదిగా సాగుతుంది. రొటీన్‌ సన్నివేశాలతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. సెకండాఫ్‌ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. శక్తి, రుద్ర మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. డైలాగులు పేలవంగా ఉండడం సినిమాకు మైనస్‌. కోటమ్మ, రుద్ర పాత్రల నేపథ్యాన్ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే..
హీరోగా అనీల్‌కు తొలి సినిమా అయినా..ఎక్కడా తడబడకుండా నటించాడు. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన యువకుడు రుద్ర పాత్రలో ఒదిగిపోయాడు. కోటమ్మ పాత్రకు సీనియర్‌ నటి జయలలిత న్యాయం చేశారు. అమె పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. పల్లెటూరి అమ్మాయి శక్తిగా విభీష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ధృతి పాత్రని అలేఖ్య న్యాయం చేసింది. తెరపై అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది.

సాంకేతిక విషయాలకొస్తే..  కోటి నేపథ్య సంగీతం జస్ట్‌ ఒకే. సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్ అందించిన పాటు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా తన కెమెరాలో బంధించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు