అనుశ్రీకి అండగా మాజీ సీఎం.. ఎవరా గాడ్‌ఫాదర్‌ ?  

4 Oct, 2020 07:04 IST|Sakshi

సాక్షి, కర్ణాటక: నిత్యం సంచలనాలు నమోదవుతున్న శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో టీవీ యాంకర్‌ అనుశ్రీని అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని అనుశ్రీ శుక్రవారం ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇదే సమయంలో కుమారస్వామి గళమెత్తారు. డ్రగ్స్‌ కేసులో అనుశ్రీకి ఒక మాజీ ముఖ్యమంత్రి సహాయహస్తం అందించినట్లు ప్రచారం జరుగుతోంది, ఆ మాజీ సీఎం ఎవరో బయట పెట్టాలని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి శనివారం బెంగళూరులో డిమాండ్‌ చేశారు. అనుశ్రీకీ మాజీ సీఎం ఒకరు ఫోన్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఆరుమంది మాజీ సీఎంలున్నారు. ఎవరనేది ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. డ్రగ్స్‌ కేసులో విస్తృతంగా దర్యాప్తు చేయాలన్నారు.   (డ్రగ్స్‌ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!)

ఆ వీడియో నాటకం: సంబరగి   
అనుశ్రీ వీడియోపై సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ సంబరగి మండిపడ్డారు. అరెస్ట్‌ భయంతోనే ఆమె నాటకమాడుతున్నారని అన్నారు. ఆమె అరెస్ట్‌ కాకుండా ఒక గాడ్‌ ఫాదర్‌ రక్షించినట్లు ఆయన ఆరోపించారు. ఆమె చేసిన తప్పులకు శిక్షను అనుభవించక తప్పదన్నారు. సీసీబీ విచారణకు హాజరైనంత మాత్రాన తాను తప్పు చేసినట్లు కాదని అనుశ్రీ వ్యాఖ్యానించడంపై ఆక్షేపించారు.    (నేరస్తురాలిని కాను: అనుశ్రీ ఆవేదన)

డ్రగ్స్‌ కేసు చాలా పెద్దది: మంగళూరు సీపీ   
డ్రగ్స్‌ కేసు చాలా పెద్దదని మంగళూరు నగర పోలీసు కమిషనర్‌ (సీపీ) వికాస్‌కుమార్‌ చెప్పారు. ఆయన శనివారం మంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. నగర సీసీబీ సీఐ శివప్రకాశ్‌ నాయక్‌ బదిలీ వెనుక ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. ఇప్పటివరకు సీసీబీపై రాజకీయ ఒత్తిడి లేదన్నారు. శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు చైన్‌ లింక్‌లా ఉంది, చివర ఎక్కడ అనేది కనిపించటం లేదని అన్నారు. మంగళూరులో ఇప్పటివరకు ఆరుమందిని అరెస్ట్‌ చేశామన్నారు. కాగా నటీమణి రాగిణి, సంజనలతో కలిసి డ్రగ్స్‌ సరఫరా చేసిన వీరేన్‌ఖన్నాపై బెంగళూరులో గతంలోనే 4 కేసులు నమోదైనట్లు తేలింది. కాగా, సంజయ్‌నగరలోని ఒక అపార్ట్‌మెంట్‌పై దాడిచేసి ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.    (ఆయనతో డ్యాన్స్‌ చేశా అంతే..)

మరిన్ని వార్తలు