అంతరిక్షంలో షూటింగ్‌ జరుపుకోనున్న తొలి చిత్రం ఇదే!

16 May, 2021 00:32 IST|Sakshi
క్లిమ్‌ షిఫెన్కో, యూలియా పెరెసిల్డ్‌

అంతరిక్షం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నిజంగా అంతరిక్షంలోనే షూటింగ్‌ జరిగితే! సాధ్యమేనా అనుకుంటున్నారా! సాధ్యం కానుంది. రష్యాకు చెందిన స్పేస్‌ ఏజెన్సీ రోస్‌కాస్మోస్‌ త్వరలో అంతరిక్షంలో షూటింగ్‌ జరపనున్నామని ప్రకటించింది. ‘ఛాలెంజ్‌’ టైటిల్‌తో ఓ స్పేస్‌ ఫిల్మ్‌ తీయనున్నామని, ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలోనే జరుపుతామని సదరు ఏజెన్సీ పేర్కొంది. రష్యన్‌ నటి యూలియా పెరెసిల్డ్‌ (36) ప్రధాన పాత్రలో క్లిమ్‌ షిఫెన్కో (37) దర్శకత్వంలో ‘ఛాలెంజ్‌’ సినిమా తెరకెక్కనుంది.

ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్‌ రాకెట్‌ ద్వారా ఈ సినిమాని లాంచ్‌ చేస్తారట. ఈలోపు యూలియా,  క్లిమ్‌లకు స్పెషల్‌ ట్రైనింగ్‌ ఇస్తుందట ఈ సినిమాను తీసే రష్యన్‌ ఏజెన్సీ. జీరో గ్రావిటీ ఉన్నప్పుడు విమానాన్ని నడపడం, ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో కిందకు దిగడం వంటి అంశాల్లో యూలియా, క్లిమ్‌ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారు.

ఈ ఇద్దరితో పాటు అలెనా మోర్డోవినా, కెమెరామేన్‌ అలెక్సీ డుడిన్‌ కూడా అంతరిక్షానికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే టామ్‌క్రూజ్‌ ప్రధాన పాత్రధారిగా అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ నాసా ఓ సినిమా చేయాలనుకుంది. ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలో జరుపుతామని దాదాపు ఏడాది క్రితం నాసా పేర్కొంది. ఇప్పుడు అంతరిక్షంలో షూటింగ్‌ చేసేందుకు రష్యా రెడీ అవుతోంది. దీంతో అంతరిక్షంలో షూటింగ్‌ జరిపిన తొలి దేశంగా గుర్తింపు పొందేందుకు రష్యా, అమెరికా పోటీ పడుతున్నాయని హాలీవుడ్‌ వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.

చదవండి: ఈ సినిమాలో ఒకటే పాత్ర ఉంటుందట

మరిన్ని వార్తలు