పిల్లల్ని కనడం గురించి సద్గురును అడిగిన ఉపాసన, ఆయన సమాధానమేంటంటే?

4 Jul, 2022 15:52 IST|Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌- ఉపాసనలది చూడముచ్చటైన జంట. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు ఇటీవలే పదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే ఇప్పటికీ వీరికి సంతానం లేదు. అది వాళ్ల వ్యక్తిగత విషయమైనప్పటికీ నెట్టింట్లో ఎప్పుడూ దీని గురిం చర్చ సాగుతూనే ఉంటుంది. ఉపాసనకు సైతం తరచూ ఈ ప్రశ్న ఎదురవుతున్నా ఏదో ఒకలా దాన్ని దాటవేస్తూ వచ్చింది. తాజాగా ఆధ్యాత్మిక గురువు సద్గురు దగ్గర పిల్లలను కనడం గురించి అడిగేసింది ఉపాసన.

'నేను పెళ్లి చేసుకుని పదేండ్లవుతోంది. నా వైవాహిక జీవితం చాలా చాలా సంతోషంగా సాగుతోంది. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ ప్రజలు మాత్రం నా లైఫ్‌లోని ఆర్‌ఆర్‌ఆర్‌ గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఫస్ట్‌ ఆర్‌.. నా రిలేషన్‌షిప్‌ గురించి, సెకండ్‌ ఆర్‌.. రీ ప్రొడ్యూస్‌(పిల్లలను కనే సామర్థ్యం), మూడో ఆర్‌.. లైఫ్‌లో నా రోల్‌.. వీటి గురించే జనాలు ఎక్కువగా చర్చిస్తున్నారు' అని చెప్పుకొచ్చింది. ఈ ప్రశ్నకు సద్గురు ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు.

'రిలేషన్‌ అనేది నీ వ్యక్తిగత విషయం. అందులో ఎవరూ తలదూర్చకూడదు. రెండోది రీప్రొడ్యూస్‌.. పిల్లలను కనకుండా ఉండేవారందరికీ నేను అవార్డులిస్తాను. ఈ తరం వాళ్లు పిల్లలని కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా మరీ అధికమైపోయింది. ఒకవేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయి. కానీ మనం అంతరించడం లేదు. ఇప్పటికే మనం ఈ భూమి మీద ఎక్కువ సంఖ్యలో ఉన్నాం' అని సద్గురు బదులిచ్చారు. ఆయన సమాధానం విన్న ఉపాసన.. మీరు ఇలా చెప్పారు కదా! ఇక మీకు మా అమ్మ, అత్తయ్యగారి నుంచి ఫోన్లు వస్తాయని సరదాగా చమత్కరించింది. దీంతో ఆయన కూడా అలాంటి అమ్మలు, అత్తల నుంచి తనకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయ్‌ అని నవ్వేశారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్‌
వారిద్దరూ కలిసి ఎలా ఉంటారో చూస్తా.. నరేష్‌ మూడో భార్య రమ్య శపథం

మరిన్ని వార్తలు