ఫైనల్‌గా వాళ్లే గెలుస్తారు!

24 Dec, 2020 00:11 IST|Sakshi
సాయితేజ్

‘‘ఈ లాక్‌డౌన్‌ ఒక్కసారి ఆగి, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. మా ఇంటి చుట్టూ ఎన్ని రకాల పక్షులు సందడి చేస్తాయో ఈ లాక్‌డౌన్‌లోనే గమనించాను. బిజీ లైఫ్‌లో ఎంత గందరగోళంగా బతుకుతున్నానో నాకప్పుడు అర్థం అయ్యింది’’ అన్నారు సాయి తేజ్‌. సుబ్బు  దర్శకత్వంలో సాయితేజ్, నభా నటేశ్‌ జంటగా బీవియస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయితేజ్‌ చెప్పిన విశేషాలు.

► కరోనా లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతున్న పెద్ద తెలుగు సినిమా మీదే! కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారంటారా?
సాయితేజ్‌: సినిమా ప్రేమికులు కచ్చితంగా వస్తారు. ఎందుకంటే  సినిమాను థియేటర్‌లో చూసే ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్ని రోజులు మిస్సయ్యాం. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకి ధైర్యం నింపటం కోసం ‘టెనెట్‌’ సినిమా విడుదలవ్వగానే నేను థియేటర్‌లో చూశాను. నా తోటి హీరోలు, దర్శకులు చాలామంది థియేటర్‌కి వెళ్లి, సినిమాను థియేటర్‌లోనే చూడమని మోటివేట్‌ చేశారు. వాస్తవానికి ఈ సినిమా మొదట మే1న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా కారణంగా వాయిదా వేశాం.

► ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అని సినిమాలో ఎందుకంటున్నారు?
కాలేజీలో చదివే ఒక యంగ్‌ బోయ్‌ తన ఫ్రెండ్స్‌కి సోలో లైఫ్‌ వల్ల లాభాలేంటని చెప్పే సినిమా ఇది. ఫ్రెష్‌గా కాలేజీ నుండి బయటకు వచ్చేవాళ్లను హీరో ఎలా ఇన్‌స్పైర్‌ చేశాడనేది సినిమా. ఆ క్రమంలో అతను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? వాటినుండి ఎలా బయటపడ్డాడు అనేది కథ. యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ అయినప్పటికీ ఫ్యామిలీ యాంగిల్‌ని ఎమోషనల్‌గా బాగా తెరకెక్కించాడు దర్శకుడు. ప్రతి ఫ్యామిలీకి ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది.

► ఈ సినిమా మీ జీవితానికి ఏమైనా దగ్గరగా ఉందా?
ఈ సినిమానే కాదు.. గతంలో చేసిన ‘చిత్రలహరి’,‘ ప్రతిరోజూ పండగే’ సినిమాలను కూడా నా లైఫ్‌కి ఎంతో దగ్గరగా ఫీలయ్యాను. ఈ సినిమా అయితే మరీ దగ్గరగా ఉంటుంది. కారణం బ్యాచ్‌లర్‌ని కావటమే. సోలోగా ఉండాలని మనం ఎలా కోరుకుంటామో, పిల్లలకు పెళ్లి కావాలని పెద్దవాళ్లూ అంతే గట్టిగా కోరుకుంటారు. ఫైనల్‌గా వాళ్లే గెలుస్తారు. మా ఇంట్లో రోజూ సుప్రభాతం తర్వాత ‘నో పెళ్లి..’ సాంగ్‌ పెద్ద సౌండ్‌తో పెడతాను. ఆ టైమ్‌లో మా అమ్మని కాఫీ అడిగితే నా వైపు ఓ చూపు చూసి ‘నువ్వే పెట్టుకో’ అంటుంది (నవ్వుతూ).

► పిల్లలకు పెళ్లవ్వాలని పెద్దవాళ్లు బలంగా కోరుకుంటారని అన్నారు.. మరి.. మీ పెళ్లెప్పుడు?
పెళ్లి చేసుకుంటే ‘ఇంటికి ఎప్పుడొస్తావ్‌? ఎక్కడున్నావ్‌? ఏం చేస్తున్నావ్‌?’ అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. అదే సోలోగా ఉంటే, మహా అయితే అమ్మ ఫోన్‌ చేసి ‘తిన్నావా?’ అని ఒకసారి అడుగుతుంది. ‘తిన్నానమ్మా’ అంటే మళ్లీ ఫోన్‌ రాదు. మా అమ్మ కోసం, ఇంట్లో వాళ్ల కోసం పెళ్లికి ఓకే అన్నా. కానీ 2020లో షూటింగ్‌లకు గ్యాప్‌ రావటం వల్ల చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. కమిట్‌ అయిన సినిమాలు అవ్వగానే చూడాలి.

► లాక్‌డౌన్‌ ఏమైనా నేర్పించిందా?
ఓర్పు, సహనంతో పాటు కృతజ్ఞత అనేది ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. మనం ఒక ప్లాన్‌లో ఉంటే దేవుడు ఇంకోటి చేస్తాడు. దానికి తగ్గట్టు మనం ఎలా నడుచుకోవాలి? మనల్ని మనం ఎలా కరెక్ట్‌ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. వాటర్‌ బాటిల్స్‌ పట్టడం ఎంత కష్టమో లాక్‌డౌన్‌ బాగానే నేర్పించింది (నవ్వుతూ).  

► కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. వాటివల్ల సినిమా పరిశ్రమకు నష్టమా? కరోనాతో నష్టపోయిన సినిమా పరిశ్రమ ఇప్పట్లో కోలుకుంటుంది అనుకుంటున్నారా?
ఇండస్ట్రీ డబుల్‌ స్పీడ్‌లో రికవర్‌ అవుతుందని నా నమ్మకం. ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చినా థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ వేరు. అలాగే ఇప్పుడు సినిమాలు చేసేవారు ఎంతో బాధ్యతతో చేస్తారు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ను పెంచుకుంటూ నటీనటుల దగ్గర నుండి వంద శాతం నటనను రాబట్టుకొని సినిమాలు చేస్తారు. మనకు ఎప్పుడైతే కాంపిటీషన్‌ ఉంటుందో అప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తాం. పోటీ మంచిదే.

► కొత్త సంవత్సరం సందర్భంగా మీరు తీసుకునే నిర్ణయాల గురించి..?
2020లో నేర్చుకున్న విషయాలను అమలు చేయాలనుకుంటున్నాను. పరిగెడుతున్న కాలం ఒక్కసారిగా ఆగిపోయినా ధైర్యం కోల్పోకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. జీవితం ఆగిపోయిందే అనుకోకుండా దమ్ముగా, ధీటుగా ముందుకెళ్లాలి. మనతోపాటు ప్రకృతి బతకాలి. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ప్రాణి పొల్యూషన్‌ లేకుండా బతకడానికి అవకాశం ఇవ్వాలి. మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనేది నా నూతన సంవత్సరం రిజల్యూషన్‌ అనుకోవచ్చు.

మరిన్ని వార్తలు