Sai Dharam Tej: అతడి వల్లే బతికున్నాను, వాళ్లందరికీ థ్యాంక్స్‌.. మెగా హీరో

26 Mar, 2022 21:23 IST|Sakshi

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురై దాదాపు ఏడు నెలలవుతోంది. గత ఏడాది సెప్టెంబరులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో సాయిధరమ్‌కి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కలసి ఉన్న ఫొటోల్లో కనిపించారే తప్ప ఇంతవరకు ప్రేక్షకుల ముందుకు రానేలేదు. ఇన్నాళ్ల తర్వాత ఆయన తన యూట్యూబ్‌ చానల్‌లో థాంక్‌ యూ నోట్‌ పేరిట ఓ వీడియో రిలీజ్‌ చేశాడు.

'గత ఆరు నెలల్లో చాలా నేర్చుకున్నాను. సంతోషం, ఆరోగ్యం, కుటుంబం ఇలా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ముందుగా నన్ను ఆస్పత్రిలో చేర్చిన సయ్యద్‌ అబ్దుల్‌ ఫరాఖ్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మానవత్వం ఇంకా బతికుందనడానికి నిలువెత్తు నిదర్శనం మీరే. మీ వల్లే నేనింకా బతికున్నాను. అలాగే మెడికవర్‌, అపోలో ఆస్పత్రి, సిబ్బందికి కృతజ్ఞతలు. చిరంజీవి గారు, కల్యాణ్‌ గారు, నాగబాబు గారు, అరవింద్‌ గారు, చరణ్‌, బన్నీ, వరుణ్‌, వైషు, ఉపాసన... వీళ్లందరూ నాకోసం నిలబడ్డారు. నేను ఆస్పత్రిలో ఉన్నానని తెలిసి నాకోసం వచ్చిన నటీనటులు, దర్శకనిర్మాతలందరికీ థాంక్యూ సో మచ్‌. అందరు హీరోల ఫ్యాన్స్‌ కూడా నా ఫ్యామిలీనే. నేను కోలుకోవాలని అన్నదానాలు, పూజలు చేశారు, కాలినడకన మెట్లెక్కారు. అందరికీ థ్యాంక్స్‌. ఎప్పటికప్పుడు నేను కోలుకుంటున్న విషయాన్ని అభిమానులకు అందజేసిన మీడియాకు థ్యాంక్స్‌.'

'అలాగే అమ్మ, వైషు, శివకు థాంక్యూ. మీరు ధైర్యంగా ఉంటూ అందరికీ ధైర్యమిచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక మూడు, నాలుగువారాలదాకా అమ్మ నాకు ఫోనివ్వలేదు. ఫోన్‌ చేతికొచ్చాక మీ మెసేజ్‌లు చూస్తుంటే నోట మాట రాలేదు. నాతోపాటు నిలబడిన స్టాఫ్‌కు థ్యాంక్స్‌. సతీష్‌ అన్న, నరేంద్ర, నాగరాజు, శైలు.. వీళ్లు నలుగురు నన్ను ఆరు నెలలపాటు చూసుకున్నారు. చిత్రహింసలు పడ్డారు. నేను కోలుకుంటున్న సమయంలో రిపబ్లిక్‌ రిలీజైంది. దాన్ని ఆదరించి సక్సెస్‌ చేశారు. ఇంతకీ ఈ వీడియో ఎందుకు చేశాననుకుంటున్నారా? ఈ నెల 28న నా కొత్త సినిమా ప్రారంభమవుతోంది. దానికి సుకుమార్‌, బాబీ నిర్మాతలు. నేను కోలుకునేంతవరకు ఆగిన వారిద్దరికీ థ్యాంక్స్‌. ఫైనల్‌గా హెల్మెట్‌ ధరించడం మాత్రం మర్చిపోకండి' అని చెప్పుకొచ్చాడు సాయిధరమ్‌ తేజ్‌.

చదవండి: Priya Prakash Varrier: కన్నుగీటు భామ ప్రియా వారియర్‌ ఇలా అయిందేంటి?

మరిన్ని వార్తలు