Sai Pallavi: ‘అనుకోని అతిథి’ మూవీ రివ్యూ

28 May, 2021 11:57 IST|Sakshi

టైటిల్‌:  అనుకోని అతిథి
న‌టీటులు: సాయిపల్లవి, ఫహద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌ రాజ్‌, అతుల్‌ కులకర్ణి, రెంజి పానికర్‌ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: వివేక్‌
సంగీతం: పీఎస్‌ జయహరి
నేపథ్య సంగీతం : జిబ్రాన్‌
సినిమాటోగ్ర‌ఫీ : అను మోతేదత్‌
విడుదల తేది :  మే 28, 2021(ఆహా)

కరోనా దెబ్బకి థియేటర్లు మూతపడడంతో ఓటీటీలకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌లు, పలు సినిమాలు ఓటీటీల్లో విడుదల చేస్తూ ఇంట్లోనే ప్రేక్షకులను వినోదం అందించే ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. తాజాగా  ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’ని తెలుగులో  ‘అనుకోని అతిథి’ పేరుతో అందుబాటులోకి తీసువచ్చారు. ఇప్ప‌టికే ఎన్నో థ్రిల్ల‌ర్ సినిమాల్ని అందించిన ప్ర‌ముఖ ఓటీటీ ఆహా ‘అనుకోని అతిథి’ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌  సినిమాపై ఆసక్తి పెంచింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (మే 28) విడుదలైన ‘అనుకొని అతిథి’ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. 

కథ
1967 నుంచి కథ ప్రారంభం అవుతుంది. ఒక పెద్ద భవంతిలో మూడు హత్యలు జరుగుతాయి. అక్కడే మానసిక సమస్యతో బాధపడే నిత్య(సాయి పల్లవి)ఉంటుంది. ఆమెను ఒక పెద్దావిడ తీసుకెళ్లి డాక్టర్ బెంజమిన్ డియాజ్ (అతుల్ కులకర్ణి)కి అప్పగిస్తుంది. కట్‌ చేస్తే... డాక్టర్‌ బెంజమిన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పిచ్చాసుపత్రిని తనిఖీలు చేయడానికి త్రివేండ్రమ్‌ మెడికల్‌ కాలేజీ నుంచి సైకియాట్రిస్ట్‌ మానేకుల కిషోర్‌ నందా అలియాస్‌ ఎంకే నందా(పహద్‌ ఫాజిల్‌) వస్తాడు. అడవిలో ఉన్న ఆ పిచ్చాసుపత్రిలో జరగకూడని చాలా జరుగుతున్నాయని డాక్టర్‌ నందాకు అర్థమవుతుంది. రోగుల పట్ల ఆ ఆస్పత్రి హెడ్‌  బెంజమిన్‌ క్రూరంగా బిహేవ్‌ చేస్తాడు.

ఆస్పత్రిని తనిఖీలు చేయడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు తనకు అనుకూలంగా రిపోర్ట్‌ ఇవ్వకపోతే చంపేయడానికి కూడా వెనకాడరు. నందపై కూడా హత్యాయత్నం జరుగుతుంది. అయినా నందా ధైర్యం కోల్పోకుండా తన పరిశోధన కొనసాగిస్తాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ గదిలో బంధించబడి ఉన్న నిత్య కనిపిస్తుంది. ఆమె గురించి ఆరా తీయగా ఆమె సంపన్న కుటుంబానికి చెందినదిగా తెలుస్తుంది.... గొప్పింటి నుంచి వచ్చిన నిత్య ఆ పిచ్చాసుపత్రిలో ఎందుకు బంధీగా ఉంది? ఆ మూడు హత్యలకు నిత్యకు సంబంధం ఏంటి? ఆస్పత్రిలో జరుగుతున్న తెరవెనుక జరుగుతున్నది ఏంటి? ఇంతకీ నిత్యకు విముక్తి లభించిందా లేదా అనేదే మిగతా కథ. 

నటీటులు
నేచూరల్‌ బ్యూటీ సాయిపల్లవి తొలిసారి మానసిక రోగి పాత్రలో నటించింది.  నిత్య పాత్రలో ఆమె పరకాయప్రవేశం చేసింది. డైలాగులు లేకుండా కేవలం తన హావభావాలతో కథను నడిపించింది.  సైకియాట్రిస్ట్‌ నందాగా పహద్‌ ఫాజిల్‌ అద్భుతంగా నటించాడు. నెగెటివ్‌ షేడ్స్‌ కలిగిన డాక్టర్‌ బెంజమిన్‌ పాత్రకు అతుల్‌ కులకర్ణి న్యాయం చేశాడు. ప్రకాశ్‌ రాజ్‌, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
కేరళలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. 2019లో మలయాళం నుంచి వచ్చిన అతిరన్‌ సినిమాకు తెలుగు  డబ్డ్‌ వెర్షన్‌ ఇది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ అయినా హరర్‌ ఎలిమెంట్స్‌ని మిక్స్‌ చేసి సరికొత్త అనుభూతిని అందించడంలో కొంతమేర దర్శకుడు వివేక్‌ సఫలమయ్యాడనే చెప్పాలి. సినిమా ఎండింగ్‌ వరకు సస్పెన్స్‌ను రివీల్‌ చేయకుండా ఉత్కంఠభరితంగా కథను నడిపించాడు. ఫస్టాఫ్‌ ఇంట్రడక్షన్, కొన్ని ట్విస్టులతో నడిపించిన డైరెక్టర్‌ అసలు కథను సెకండాఫ్‌లో చూపించాడు. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ అదిరిపోయింది. అయితే థ్రిల్లర్‌ సినిమాలు రెగ్యులర్‌గా చూసేవాళ్లకు క్లైమాక్స్ అంత కొత్తగా మాత్రం అనిపించదు.  ఇది పరభాష చిత్రం అయినప్పటికీ ఆ ఫీలింగ్‌ ఎక్కడా కలగదు. ఇక ఈ సీనిమా మరో ప్రధాన బలం నేపథ్య సంగీతం. జీబ్రాన్‌ తన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అను మోతేదత్‌ కెమెరా పనితనం బాగుంది. అడవి లొకేషన్స్‌ని అద్భుతంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు