మూడేళ్లలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి!

16 May, 2021 14:46 IST|Sakshi

Sai Pallavi: సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది సాయి పల్లవి. పెద్ద, చిన్న సినిమా అనే తేడా లేకుండా తన క్యారెక్టర్‌ ముఖ్యమైందా లేదా అని చూసుకొని కథలను ఒప్పుకుంటుంది. పెద్ద హీరో సినిమా అయినా సరే.. తన పాత్రకు ప్రాముఖ్యత లేకుంటే సున్నితంగా తిరస్కరిస్తుంది. అలా గత మూడేళ్లలో సాయిపల్లవి రూ.5 కోట్లు నష్టపోయిందట. అదెలా అంటారా?..  సాయిపల్లవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నంచి కోటి వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. ఇక ఫిదా సూపర్‌ హిట్‌ కావడంతో ఈ మలయాళ కుట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ వచ్చిన ప్రతీ సినిమాను ఒప్పుకోకుండా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేసుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించిందట.

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్‌ను వదులుకుందట ఈ మలయాళ భామ. ఆ తర్వాత మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా మొదట సాయిపల్లవినే హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ పాత్ర నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్‌ చేసిందట.

అలాగే.. అయ్యప్పనుమ్ కోషియం( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాదన్(రీమేక్) వంటి సినిమాలు రిజెక్ట్ చేసిందట. ఇవన్నీ భారీ సినిమాలు కాబట్టి ఆమెకు కోటి పైనే పారితోషికం ఇస్తాము అని నిర్మాతలు ఆఫర్ ఇచ్చారట. కానీ హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు అని భావించి ఆమె రిజెక్ట్ చేసిందట. వీటితో పాటు దాదాపు 6 కమర్షియల్‌ యాడ్స్‌ని కూడా ఒప్పుకోలేదట. వీటీ విలువ దాదాపు రూ.5 కోట్ల పైనే ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.  ఇక సాయి పల్లవి ప్రస్తుతం లవ్‌స్టోరీ, విరాటపర్వం చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు