యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న సాయి పల్లవి ‘సారంగదరియా’ సాంగ్

22 Jun, 2021 21:21 IST|Sakshi

యూట్యూబ్‌ను షేక్‌ చేసిన సాయిపల్లవి సాంగ్స్‌ అనగానే అప్పట్లో రౌడీ బేబీ, ఇప్పట్లో సారంగదరియా పాటలే గుర్తొస్తాయి. ఈ పాటల్లో మత్తుందో, సాయి పల్లవి స్టెప్పుల్లో కిక్కుందో తెలీదు గానీ ఇవి రెండూ సూపర్‌ డూపర్‌ హిట్టయ్యాయి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని సారంగదరియా పాట ఇప్పటికే యూట్యూబ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. దాని కుడి భుజం మీద కడువా.. అంటూ సాగిపోయిన ఈ జానపదం విడుదలైన మరుక్షణం నుంచే వేగం పెంచేసింది. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు ఆమె డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్‌గా నిలవడంతో ఈ పాట వరుసగా రికార్టులను సొంతం చేసుకుంటోంది. 

సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ ముగ్ధ మనోహరంగా ఆలపించింది. తెలంగాణ జానపదానికి తోడు పవన్‌ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతూ తాజాగా 250 మిలియన్ల(25 కోట్లు) వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. విడుదలైన 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించగా 32 రోజుల్లో 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన ఈ పాట ఇప్పుడు 250 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న ఈ ‘లవ్ స్టోరీ’ మూవీ ఏప్రిల్‌ 16న రిలీజ్‌ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించారు.

మరిన్ని వార్తలు