Sakala Gunabhi Rama Review: ‘సకల గుణాభిరామ’ మూవీ రివ్యూ

16 Sep, 2022 17:00 IST|Sakshi

టైటిల్‌: సకల గుణాభిరామ
నటీనటులు:  వి జె సన్నీ, అసిమా, శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ. చమ్మక్ చంద్ర,తదితరులు
నిర్మాత: సంజీవ్ రెడ్డి 
దర్శకుడు : వెలిగొండ శ్రీనివాస్ 
సంగీతం:  అనుదీప్ 
 కెమెరా మాన్ : నళిని కాంత్ 
ఎడిటర్ : వెంకట్
విడుదల తేది:  సెప్టెంబర్‌16, 2022

బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయ్యాడు నటుడు విజే సన్నీ. అంతకు ముందే పలు సిరియల్స్‌తో పాటు సినిమాలలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు కానీ.. బిగ్‌బాస్‌ 5లో పాల్గొని విన్నర్‌గా నిలవడంతో సన్నీ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసింది. బిగ్‌బాస్‌ షో తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సకల గుణాభిరామ’. అసిమా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్‌ 16)న విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
మధ్య తరగతి కుటుంబానికి చెందిన అభిరామ్‌(సన్నీ) ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. స్వాతి(అసిమా)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వచ్చే జీతం చాలక వడ్డీ వ్యాపారి ప్రదీప్‌(శ్రీతేజ్‌) దగ్గర అప్పు తీసుకొని ఇబ్బంది పడుతుంటాడు. ఆర్థిక పరిస్థితి కారణంగా స్వాతి పిల్లలను కనడం వాయిదా వేస్తూ వస్తుంది. ఓ రోజురాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి.. స్వాతి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అభిరామ్‌ ఎదుర్కొన్న సమస్యలేంటి? అలిగివెళ్లిపోయిన భార్య తిరిగి వచ్చిందా లేదా? భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత రామ్‌ ఏం చేశాడు? అతనిలో వచ్చిన మార్పు ఏంటి? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి.. చాలీచాలని జీతం.. దాని వల్ల ఫ్యామిలీతో జరిగే గొడవలు..ఇలాంటి కాన్సెప్ట్‌ కథలు నవ్విస్తూనే.. ఎమోషనల్‌కు గురిచేస్తాయి. అలాంటి కథే ‘సకల గుణాభిరామ’. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే కాదు… ఏవైనా పొరపాట్లు జరిగితే… వాటిని క్షమించే గుణం కూడా భార్యా భర్తలకు ఉండాలి’ అనే మంచి సందేశాన్ని హాస్యాన్ని జోడించి చెప్పాడు దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ .ఫస్ట్ హాఫ్ అంతా… హీరో పనిచేసే కంపెనీలో సహా ఉద్యోగులతోనూ, యజమానితోను సరదా సరదా సన్నివేశాలతో రోటీన్‌గా సాగుతుంది. అసలు కథ సెకండాఫ్‌లో ఉంటుంది.

పరాయి స్త్రీతో పరిచయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది?దాని వల్ల  అభి నేర్చుకునే గుణపాఠం ఏంటి? తదితర విషయాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో వచ్చే కొన్ని సీన్స్‌ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కలిగిస్తాయి. యూత్‌ ఆడియన్స్‌ని మెప్పించడానికే కొన్ని సీన్స్‌ని పెట్టారు. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మంచి కథ.. కథనాలను రాసుకున్నాడు. అయితే మరింత బాగా దాన్ని తెరమీద ఆవిష్కరించి  ఉంటే మంచి సినిమా అయ్యేది.

ఎవరెలా చేశారంటే..
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, చిలిపి భర్త అభిరామ్‌ పాత్రలో ఒదిగిపోయాడు సన్నీ. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లో కూడా తనదైన నటనతో మెప్పించాడు. డ్యాన్స్‌ కూడా ఇరగదీశాడు. అభిరామ్‌ భర్త స్వాతిగా ఆసిమా తనదైన నటనతో ఆకట్టుకుంది. విలన్ భార్య  దీపిక పాత్రలో నటించిన తరుణీ సింగ్ తన బబ్లీ నటనతో ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఆమెతో హీరో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.

వడ్డీ వ్యాపారి ప్రదీప్ పాత్రలో శ్రీతేజ్ విలక్షణంగా కనిపించి మెప్పించాడు. జెమినీ సురేష్, సరయూ. చమ్మక్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. అనుదీప్ సంగీతం, నళిని కాంత్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ వెంకట్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు