Singeetam Srinivasa Rao: ఈ అవార్డుతో ఇంకా చేయాలనే ప్రోత్సాహం లభించింది: సింగీతం

25 Sep, 2021 09:13 IST|Sakshi

Sakshi Excellence Awards: కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్‌. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఇందులో భాగంగా 2019గాను జీవితసాఫల్య పురస్కారంతో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుని సత్కరించింది.  అయితే వివిధ కారణాలతో ఆయన వేడుకకి రాలేకపోయారు. ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ అవార్డు అందుకున్నారు. అనంతరం అవార్డు గురించి సింగీతం సాక్షితో మాట్లాడాడు. ఆయన మాటాల్లోనే..

‘ముందుగా జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించిన ‘సాక్షి’ యాజమాన్యానికి ధన్యవాదాలు. సినిమా పరిశ్రమకు మా కాంట్రిబ్యూషన్‌ ఉంది. అది ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ. కానీ ప్రాక్టికల్‌గా మిగతా రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి అవార్డులతో సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

‘సాక్షి’ వారు నాకు ప్రదానం చేసిన ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగినట్లుగా భావిస్తున్నాను. ఇంకా కాంట్రిబ్యూషన్‌ చేయాలన్నది ఇప్పుడు నా మెయిన్‌ ప్లాన్‌. నాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ‘ఇంకా చెయ్‌’ అనేవారు నాకు కావాలి. ఇప్పుడు ఈ అవార్డుతో నాకింకా చేయాలనే ప్రోత్సాహం లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలవడం ఒక ఆనందం. కానీ ఈ అవార్డు ఫంక్షన్‌కు రావాలని నేను ఎంత ప్రయత్నించినప్పటికీ రాలేని పరిస్థితి. ఇందుకు నేను చాలా బాధపడుతున్నాని’ అన్నారు.

మేం ఏం చేస్తే ఈ అవకాశం వస్తది: దర్శకుడు గుణశేఖర్‌
సింగీతం శ్రీనివాసరావు తరఫున అవార్డు అందుకున్న అనంతరం దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ.. ‘పెద్దాయన సింగీతం శ్రీనివాస రావు గారు ‘లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ అందుకుంటూ కూడా... ‘ఇంకా నాకు ఎంతో కంట్రిబ్యూట్‌ చేయాలనిపిస్తోంది’ అన్న తర్వాత మాలాంటివాళ్లం ఇంకా ఎంత కంట్రిబ్యూట్‌ చేస్తే మాకిలాంటి అవకాశం వస్తది! ఆయన అవార్డును ఆయన తరఫున నేను అందుకోవడం ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్‌.’ అన్నాడు.

మరిన్ని వార్తలు