Hari Teja: కరోనాతో పోరాడుతూ... బిడ్డను కన్నాను!

1 May, 2021 00:58 IST|Sakshi

మరో వారం పది రోజుల్లో డెలివరీ... బిడ్డ పుట్టగానే ఎలా ఉందో చూడాలనే ఆరాటం.. తాకాలనే అనురాగం... బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకోవాలన్న ఆనందం. ఇలా... ఎన్నో ఆశలతో హరితేజ డెలివరీ కోసం ఎదురు చూశారు. సరిగ్గా డెలివరీ టైమ్‌కి వారం పది రోజుల ముందు కరోనా పాజిటివ్‌. నెగటివ్‌ ఆలోచనలు దగ్గరకు రాకూడని పరిస్థితి. రుచి తెలియకపోయినా తినాల్సిన పరిస్థితి. బిడ్డ బాగుండాలంటే తల్లి ప్రశాంతంగా ఉండాలి. మరి.. యాంకర్, ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్, నటి హరితేజ ఈ కరోనా కష్టకాలాన్ని ఎలా అధిగమించారు? ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం.

► మీకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ కరోనా వచ్చిందని విన్నాం...
హరితేజ: అవును. నాతో పాటు మా అమ్మానాన్న ఉన్నారు. నాకు డెలివరీ టైమ్‌ దగ్గరపడటంతో మా అత్తగారు బెంగళూరు నుంచి వచ్చారు. ఒక్క మావారికి తప్ప ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్‌. అమ్మానాన్న, అత్తయ్య వేరే ఇంట్లో క్వారంటైన్‌లో ఉండిపోయారు. నాతో పాటు మావారు ఉన్నారు.

► ఇంట్లో ముందు ఎవరికి వచ్చింది?
మా అమ్మానాన్నకు! వాళ్లకి వచ్చిన రెండు మూడు రోజులకు నాకు వచ్చింది. నాకు ముందు జ్వరం వచ్చింది.. కొంచెం నీరసంగా అనిపించింది. రెండు రోజులకు రుచి, వాసన పోయాయి. అప్పుడే నాకు పాజిటివ్‌ అని ఫిక్పయిపోయాను. కానీ ఇంట్లోవాళ్లు అలాంటిదేం ఉండదని వాదించారు. టెస్ట్‌ చేయించుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి ‘నెగటివ్‌ వస్తే బాగుంటుంది’ అని పదే పదే దేవుణ్ణి తలుచుకున్నాను.. అయితే దురదృష్టం పాజిటివ్‌ అని వచ్చింది. ఆల్రెడీ నాకు తొమ్మిది నెలల నిండాయి. పొట్ట బరువు ఎక్కింది. మావారికి నెగటివ్‌ వచ్చింది. అయినా నన్ను అంటిపెట్టుకునే ఉన్నారు.. ఆయనకు ఎక్కడ కరోనా సోకుతుందోనని నా భయం.

► ఇంట్లో ఒకరికి కరోనా వచ్చినా పనివాళ్లను రమ్మనలేం. మీకు సహాయంగా మీవారు తప్ప ఇంట్లే వేరే ఆడవాళ్లు లేరు. ఇంటిపనులు ఎలా మేనేజ్‌ చేశారు?
అంతా మావారే చేశారు. ఆయనకు వంట వచ్చు. ఆ మాటకొస్తే ఆయనకు రానిదంటూ లేదు. ఒక్క ఈ పరిస్థితుల్లోనే కాదు.. మిగతా రోజుల్లో కూడా నేను షూటింగ్స్‌ కోసం అవుట్‌డోర్‌ వెళ్లినప్పుడు ఆయనే ఇంటిని మ్యానేజ్‌ చేస్తారు. అందుకని ఇబ్బందిపడలేదు.

► నార్మల్‌వాళ్లే కరోనా సోకిందంటే భయపడుతున్నారు. మీరేమో వట్టి మనిషి కాదు. ‘పాజిటివ్‌’ అని రాగానే మీ మానసిక స్థితి ఏంటి?
అప్పటివరకూ డెలివరీ టైమ్‌లో నొప్పి బాగా ఉంటుందేమో? డెలివరీ ఎలా జరుగుతుందో? అనే ఆలోచనలు ఉండేవి. కానీ అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. కరోనా అని తెలిశాక రాత్రీపగలూ ఒకటే టెన్షన్‌. ఏ టైమ్‌లో ఏం జరుగుతుందో? ఏం వినాల్సి వస్తుందో? అని భయం. బేబీ బాగుంటే చాలు అనేది మాత్రమే మనసులో ఉండేది.

► బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు అమ్మ వీలైనంత ప్రశాంతంగా ఉండాలి.. టెన్షన్‌ తగ్గించుకోవడానికి ఏం చేశారు?
కరెక్టే... ఎక్కువ టెన్షన్‌ పడితే నాకు బీపీ పెరిగితే బిడ్డకు మంచిది కాదు. అందుకే నేను కొంచెం బ్యాలెన్డ్స్‌గానే ఉండేదాన్ని. కరోనా అని తెలిసి నా చుట్టూ ఉన్నవాళ్లు ఏడ్చినా, విపరీతంగా బాధపడినా నాకు మాత్రం ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ‘మన కడుపులో ఇంకొకరు మన మీద ఆధారపడి ఉన్నారు’ అనే ఫీలింగ్‌ ఏడ్వనివ్వలేదు. ‘ఈ టైమ్‌లో మీరు టెన్షన్‌ పడితే బీపీ పెరిగిపోతుంది. వీలైనంత కూల్‌గా ఉండండి’ అని డాక్టర్లు కూడా చెప్పారు.. ఇక నా కళ్లముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్‌ ‘ధైర్యంగా ఉండడం’. నాకు నేనుగా ధైర్యం తెచ్చుకున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ నేను ప్రశాంతంగా ఉండగలిగానంటే కారణం నేను చేసిన యోగా.. ధ్యానం. తెల్లవారుజాము నాలుగు గంటలకల్లా నిద్రలేచి, మా మేడ మీద ‘ప్రాణాయామం’ చేసేదాన్ని. దానివల్ల శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది అనిపించలేదు. ధాన్యం వల్ల ప్రశాంతంగా ఉండగలిగాను.

► కరోనా అంటే రుచి, వాసన తెలియదు. రుచి తెలియకపోతే ఆహారం తీసుకోలేం. తినాల్సిన నిర్బంధ పరిస్థితి మీది..
అదో బాధ అండీ.. బేబీ కోసం కచ్చితంగా తినాల్సిందే. ఏమీ తినబుద్ధయ్యేది కాదు. కరోనా సోకిన తర్వాత మావాళ్లు తినలేకపోయారు. నాక్కూడా అన్నం చూస్తే ఏదోలా ఉండేది. కానీ కడుపులో బేబీ ఉంది కాబట్టి, బలవంతంగా తిన్నాను. ఏం చేసినా బేబీ కోసమే. కొత్త టెన్షన్‌ని పక్కన పెట్టడం, బాధని వెనక్కి నెట్టడం నుంచి తినాలనిపించకపోయినా తినడం వరకూ ఏం చేసినా బేబీ క్షేమం కోసం చేశాను.

► గర్భవతిగా ఉన్నప్పుడు ఏ మందులు పడితే అవి వాడకూడదు. మరి.. కరోనాకి డాక్టర్లు ఇచ్చే మందులు వాడలేని స్థితిలో ఉన్న మీరు.. వేరే ఏ జాగ్రత్తలు తీసుకున్నారు?
అవునండీ... మందులు వాడలేదు. అందుకు బదులుగా ప్రతిరోజూ ఉదయం వేపాకులు నమిలేదాన్ని. తులసి ఆకులు తినేదాన్ని. అల్లం, మిరియాలతో కషా యం చేసుకుని తాగేదాన్ని. రోజుకి నాలుగుసార్లు ఆవిరి పట్టేదాన్ని. యోగా, ధ్యానం వంటివి కూడా హెల్ప్‌ అయ్యాయి. నెగటివ్‌ తెచ్చుకోవాలనే తపనతో జాగ్రత్తలు తీసుకున్నాను.

► జనరల్‌గా మనకున్న సౌకర్యాలను బట్టి డెలివరీ జరిగే ఆసుపత్రిని సెలక్ట్‌ చేసుకుంటాం. మీరలా ఎంపిక చేసుకునే ఉంటారు. ఫైనల్‌గా కోవిడ్‌ ఆçసుపత్రిలోనే డెలివరీ అన్నప్పుడు కంగారుపడ్డారా?
తొమ్మిది నెలలు ప్రతి నెలా చెకప్‌కి ఒకే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను. మంచి ఆసుపత్రి సెలక్ట్‌ చేసుకుని, డెలివరీకి ప్రిపేర్‌ అయ్యాను. కానీ అది ‘నాన్‌ కోవిడ్‌ హాస్పిటల్‌’. అక్కడ కుదరదన్నారు. వేరే డాక్టర్‌ని సూచించారు. తొమ్మిది నెలల నా ఆరోగ్య స్థితి ఆ డాక్టర్‌కి తెలిసినంతగా కొత్త డాక్టర్‌కి తెలుస్తుందా? అని టెన్షన్‌ పడ్డాను. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కొంత రిలీఫ్‌ ఇస్తాడంటారు. అలా నేను వెళ్లిన డాక్టర్‌ నాకు చాలా ధైర్యం చెప్పారు. ‘ఏం ఫర్వాలేదు.. కూల్‌గా ఉండండి’ అన్నారు. ట్రీట్‌మెంట్‌ బాగా జరిగింది. నాకు డాక్టర్లందరూ దేవుళ్లలా కనిపించారు. అంతా సజావుగా జరిగేలా చేశారు.

► నార్మల్‌ డెలివరీ కాకుండా ‘సిజేరియన్‌’ చేయించుకోవాల్సి  రావడం గురించి...
నార్మల్‌ డెలివరీ అవ్వాలన్నదే నా ఆశ. అందుకే యోగా చేసుకుంటూ, డ్యాన్స్‌ కూడా చేసేదాన్ని. కింద కూర్చుని, పైకి లేవడం... ఇలా చాలా యాక్టివ్‌గా ఉన్నాను. విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నాను. వేరే ఆరోగ్య సమస్యలేవీ లేవు. నార్మల్‌ డెలివరీయే అని డాక్టర్‌ కూడా అన్నారు.  కోవిడ్‌ హాస్పిటల్‌ కాబట్టి అందరూ కరోనా పేషెంట్లే! డాక్టర్లంతా ‘పీపీఈ’ డ్రెస్సులతో ఫుల్లీ కవర్డ్‌! ఆ వాతావరణం కొంచెం డిస్టర్బింగ్‌గానే అనిపించింది. ఆందోళన పడకూడదన్నా పడతాం. ఇక కరోనా సోకడంతో నార్మల్‌ డెలివరీ మంచిది కాదన్నారు. ఓ ఆరేడు గంటలు నొప్పులు పడటంవల్ల బిడ్డకు మంచిది కాదని, సిజేరియన్‌ చేయాల్సిందేనని అన్నారు. ప్లస్‌ నొప్పులు తట్టుకునే శక్తి ఉంటుందా? అనే సందేహం కూడా డాక్టర్లకి ఉంది. అందుకే వీలైనంత త్వరగా బేబీని బయటకు తీయాలన్నారు. ఆపరేషన్‌ థియేటర్‌కి వెళ్లేటప్పుడు ‘డెలివరీ ఎలా జరిగినా.. ఏ డాక్టర్‌ చేసినా.. నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు’ అని కోరుకున్నాను.

► బిడ్డ పుట్టగానే చూశారా... తాకారా?
ఒక బాధాకరమైన విషయం ఏంటంటే... వెంటనే చూడలేదు. ఇక తాకే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? బిడ్డను బయటకు తీయగానే వేరే గదిలో ఉంచారు. వీడియో కాల్స్‌లో చూపించారు. లక్కీగా మా పాపకు నెగటివ్‌ వచ్చింది.

► మీకెప్పుడు నెగటివ్‌ వచ్చింది.. పాపను ఎప్పుడు తాకారు? మరి... బిడ్డకు ఆహారం ఎలా?
పాలు ఇవ్వమన్నారు. బేబీకి నా ఉమ్ము టచ్‌ కాకూడదన్నారు. పాలు పట్టినంతసేపూ దగ్గకుండా, తుమ్మకుండా ఉండాలి. పాప పాలు తాగున్నంతసేపూ ముఖం ఒకవైపుకి తిప్పుకునేదాన్ని. ఆ పది నిమిషాలూ భయం భయంగానే ఉండేది. చేతులకు గ్లౌజులు వేసుకుని ఎత్తుకునేదాన్ని. పాప పుట్టిన 11 రోజులకు నాకు నెగటివ్‌ వచ్చింది. అప్పుడు గ్లౌజులు అవీ తీసేసి, పాపను తాకితే భలే అనిపించింది. గట్టిగా హత్తుకున్నాను.

► పాపకు పేరు పెట్టారా?
లేదు. ఈ కరోనా టైమ్‌లో నామకరణం వేడుక అంటే సాధ్యం అయ్యేది కాదు. అందుకే ఓ రెండు నెలలు ఆగుదాం అనుకున్నాం.

► ఇప్పుడంతా రిలీఫ్‌.. ఈ ఆనందాన్ని షేర్‌ చేసుకుంటారా?
దేవుడి దయవల్ల పెద్ద గండం నుంచి బయటపడ్డట్లయింది. నాకు ఈ ఆనందం ఈజీగా దక్కలేదు. నార్మల్‌గా నొప్పులు పడి కన్న అమ్మకు చాలా స్పెషల్‌గా ఉంటుంది. సిజేరియన్‌ అయినా సరే ఆనందంగానే ఉంటుంది. నేను కరోనాతో ఫైట్‌ చేస్తూ, బిడ్డను కన్నాను. కాబట్టి నాకు డబుల్‌ స్పెషల్‌... డబుల్‌ హ్యాపీనెస్‌. ధైర్యం కూడా డబుల్‌ అయింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. వేరే ఏ టెన్షన్స్‌ మనసులో లేవు. నా పాపతో చక్కగా గడుపుతున్నాను.

► తొమ్మిది నెలల ప్రాసెస్‌లో డెలివరీ గురించి భయపడ్డారా?
మనకు ఆకలి వేసినప్పుడు రెస్టారెంట్‌కి వెళ్లి అది తిందాం.. ఇది తిందాం అనుకుంటాం. అవి దొరక్కపోతే ఆకలి తీర్చుకోవడానికి ఏది దొరికితే అది తింటాం. అప్పటివరకూ నచ్చినది తినాలనే కోరిక ఫిల్టర్‌ అయిపోయి, ‘ఏమీ వద్దు భగవంతుడా... ఆకలి తీరితే చాలు’ అనుకుంటాం. నా పరిస్థితి కూడా అలానే అయింది. ‘ఏమీ వద్దు. నా బిడ్డ బాగుంటే చాలు. ఆరోగ్యంగా ఉంటే చాలు’. అదొక్క ఆలోచన తప్ప వేరే ఏదీ లేదు. డెలివరీ టైమ్‌లో నాకేదైనా కష్టంగా ఉంటుందేమో అని అప్పటివరకూ ఉన్న ఆలోచనలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.

► మీరు ప్రెగ్నెంట్‌ కాబట్టి ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుని ఉంటారు. మరి.. ఎవరి ద్వారా కరోనా వచ్చిందంటారు?
మనకేం కాదులే అనే ధైర్యం ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఆ ధైర్యం ఎక్కువే. పైగా ఇంట్లో అందరికీ రోగనిరోధక శక్తి బాగానే ఉంటుంది. పనివాళ్లు, పాల ప్యాకెట్లు, డెలివరీ బాయ్స్‌.. ఇలా అందరూ వస్తారు. ఎక్కడినుంచి, ఎవరి ద్వారా అని ఇప్పుడు ఆలోచించడం అనవసరం. నాకు రావాలని రాసిపెట్టి ఉంది.. వచ్చింది. నా కూతురు కడుపులోనే ఫైట్‌ చేసి, బయటకు రావాలని ఉంది కాబట్టి ఇలా జరిగిందనుకుంటున్నాను. ఆ సంగతలా ఉంచితే.. ‘మనకేం అవుతుందిలే’ అని ఎవరూ తేలికగా తీసుకోకూడదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మేం నేర్చుకున్న పాఠం ఇది.

ఇప్పటివరకూ ఎన్నో కష్టాలు తట్టుకుని నిలబడ్డాను కానీ ఇది వేరే కష్టం. మన భుజం తట్టే మనిషి పక్కన ఉండలేని పరిస్థితి. మనం మనోధైర్యంతో ఉండగలిగితే ఏ కష్టాన్నయినా ఎదుర్కోగలుగుతాం అని నేర్చుకున్నాను. ఇదే అందరికీ చెబుతాను. కష్టం వచ్చినప్పుడు కంగారుపడతాం. అది సహజం. అయితే దాన్ని ధైర్యంగా అధిగమించి, నిలబడాలి. నా జీవితంలో ఇదొక మైలురాయి అనాలి. ముఖ్యంగా మనల్ని నమ్ముకుని మన లోపల ఒకరున్నారనే జాగ్రత్త ప్రెగ్నెంట్‌ ఉమన్‌కి ఉండాలి. ఇంట్లో అందరూ తనని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. నాకు కరోనా గురించి అవగాహన లేదు కాబట్టి, విపరీతంగా భయపడ్డాను. కానీ అంత భయపడక్కర్లేదు. డాక్టర్లు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏది ఏమైనా బిడ్డను కనేవరకూ కరోనా రాకపోయినా వచ్చినట్లే ఉంటే.. కష్టాలు రాకుండా ఉంటాయి. ప్రశాంతంగా డెలివరీకి వెళ్లొచ్చు. మరో విషయం ఏంటంటే... తల్లికి వచ్చినంత మాత్రాన బిడ్డకు కరోనా సోకుతుందని లేదు. ఎక్కడో ఒకరిద్దరికి తప్ప ఎక్కువ శాతం బిడ్డలకు సోకడం లేదు. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి.
– డి.జి. భవాని

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు