Pooja Hegde: దానికి వయసుతో సంబంధం లేదు, ఒక్కోటి నెరవేర్చుకుంటూ వస్తున్నా

23 Jan, 2022 01:26 IST|Sakshi

ముంబైలో పూజా హెగ్డే కొత్త ఇల్లు కట్టుకున్నారు. శుక్రవారం శుభముహూర్తాన ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు.. అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నానని అన్నారు. ఇంకా కొత్తింటి విశేషాలను  ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

► సొంత సంపాదనతో ఇల్లు కట్టుకున్నారు... చెప్పలేనంత ఆనందంలో ఉండి ఉంటారు...
పూజా హెగ్డే: అవును. ఇదొక అద్భుతమైన అనుభూతి. ముంబై, హైదరాబాద్, చెన్నై, విదేశాలు... ఇలా షూటింగ్‌ల కోసం రకరకాల ప్రదేశాలకు వెళుతుంటాను. పండగలప్పుడు కూడా షూటింగ్స్‌ చేస్తుంటాను. కెరీర్‌లో ఏదైనా సాధించాలనే కల ఒక్కోటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాను. కష్టం అనుకోకుండా హార్డ్‌వర్క్‌ చేస్తూ వస్తున్నాను. అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఒక ఇల్లు సొంతం చేసుకోవడం అనేది మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది.

► హార్డ్‌ వర్క్‌ మన కలల్ని నెరవేర్చుతుందనే విషయం ఇలా ఇల్లు కొనడం ద్వారా మీకు అనిపిస్తోందా?
డెఫినెట్లీ. నిజానికి నేను అమ్మాయిలకు చెప్పదలచుకున్నది ఇదే. కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు. దక్షిణాదికి చెందిన ఒక సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా నా కలలను నేను నెరవేర్చుకుంటున్నాను.

హార్డ్‌వర్క్‌ మన కలల్ని నెరవేర్చుతుందని అమ్మాయిలకు చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయంలో చిన్నపిల్లలకు కూడా ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాను. అమ్మాయిలూ... మిమ్మల్ని మీరు నమ్మండి. కలలు కనండి. మీ హార్డ్‌వర్క్‌ ద్వారా అవి నెరవేరినప్పుడు ఆ కలలకు ఓ వేల్యూ ఉంటుంది. మీరు ఏ వృత్తి ఎంచుకున్నా వంద శాతం కష్టపడండి. ఫలితం తప్పకుండా ఉంటుంది.

► ఇల్లు పూర్తయ్యాక ఒక్కోటి కొనాలనుకున్నారా? ముందే షాపింగ్‌ చేశారా?
ఏడాదిగా ఎక్కడికి వెళ్లినా ఇంటి కోసం షాపింగ్‌ చేయడం కామన్‌ అయింది. ఒకవైపు షూటింగ్స్‌ చేస్తూనే ఇంటి పనులు ఎలా జరుగుతున్నాయో చూసుకునేదాన్ని. నా అభిరుచికి తగ్గట్టుగా డిజైన్‌ చేయించుకున్నాను. ఈ విషయంలో మా అమ్మ హెల్ప్‌ ఉంది. ఇల్లు పూర్తయ్యాక మెల్లిగా ఒక్కోటి కొనుక్కోవచ్చనుకోలేదు. ఇంట్లో ఏమేం ఉంటో బాగుంటుందో అమ్మా, నేను ముందే అనుకున్నాం. అందుకే ఇల్లు పూర్తయ్యేలోపే అన్నీ కొన్నాం. కొన్ని ఇక్కడ, విదేశాలు వెళ్లినప్పుడు అక్కడ కొన్నాను.

► కూతురు ఇల్లు కొనుక్కున్నందుకు మీ అమ్మానాన్న ఫీలింగ్‌ని చెబుతారా?
మా అమ్మానాన్న చాలా సపోర్ట్‌ చేశారు. వాళ్లయితే చాలా ఎగ్జయిట్‌ అవుతున్నారు. మన సౌత్‌ ఇండియన్స్‌కి లైఫ్‌లో ఒక సొంత ఇల్లు ఉండాలనే జీవితాశయం ఉంటుందని నా ఫీలింగ్‌. అమ్మానాన్నకు సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూతురు ఇలా ఇల్లు కట్టుకున్నందుకు ఆనందపడుతున్నారు. ‘రైట్‌ హౌస్‌’ సెలక్ట్‌ చేసుకునే విషయంలో ఇద్దరూ నాకు హెల్ప్‌ చేశారు.

► మీది సీ ఫేసింగ్‌ హౌస్‌ కదా?
యస్‌.. కావాలనే అలా ప్లాన్‌ చేసుకున్నాను.

మరిన్ని వార్తలు