నా సక్సెస్‌ క్రెడిట్‌ ఆ ఇద్దరిదే!

11 Jun, 2021 01:10 IST|Sakshi
‘బన్నీ’ వాసు

‘‘ఒక కొత్త కథ విన్నప్పుడు మనకో ఊహ ఉంటుంది. కానీ మన ఊహ సరైనదని కాకుండా అవతలివారి విజన్‌ను అర్థం చేసుకోవాలి. కథలోని పాత్రలను వారి పాయింటాఫ్‌ వ్యూలో కూడా చూడాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. శుక్రవారం (జూన్‌11) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ‘బన్నీ’ వాసు చెప్పిన విశేషాలు.

► సాధారణంగా కొత్తవారు చెప్పిన స్క్రిప్ట్‌ మాకు నచ్చితే మేం నిర్మిస్తాం. కానీ ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్‌లో ఆసక్తి ఉన్నవారికి కూడా అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అంటే మా పర్యవేక్షణలో సాగే  సినిమా ప్రొడక్షన్‌లో వారి భాగస్వామ్యం కూడా ఉంటుంది.

► ‘చావు కబురు చల్లగా’ సినిమా ఫలితం నిరాశపరిచింది. సినిమా అంతా తల్లి పాత్ర మీద ఉంటుంది. ఈ పాత్రను ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా చూపించలేకపోయాం. ఒక సినిమా థియేటర్స్‌లో విడుదలై సక్సెస్‌ అయితే నిర్మాతలకు వచ్చే ఆదాయం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల రాదు. అందుకే రెగ్యులర్‌ ప్రొడ్యూసర్స్‌ థియేటర్స్‌లోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. త్వరలో ఫిఫ్టీ పర్సెంట్‌ సామర్థ్యంతో థియేటర్స్‌ రీ ఓపెన్‌ అవుతాయంటున్నారు. అక్టోబరుకి వందశాతం సీటింగ్‌ సామర్థ్యానికి అనుమతులు రావొచ్చు. కరోనా థర్డ్‌ వేవ్‌ రాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ థర్డ్‌ వేవ్‌ వస్తే థియేటర్స్‌ రీ ఓపెన్‌ అయ్యేది కొత్త ఏడాది జనవరిలోనే.

► ఏదైనా కథ నాకు నచ్చితే ముందు అల్లు అరవింద్‌గారికి వినిపిస్తాను. ఆయనకు కూడా నచ్చితే సెట్స్‌పైకి తీసుకుని వెళతాము. అలాగే మా ఇద్దరిలో ఏ ఒక్కరికి కథ నచ్చకపోయినా ప్రాజెక్ట్‌ను వదిలేస్తాం. ప్రొడ్యూసర్‌గా నా సక్సెస్‌ క్రెడిట్‌ను అల్లు అరవింద్, బన్నీ (అల్లు అర్జున్‌)గార్లకే ఇస్తాను. వారే నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు.

► నేను నిర్మాతగా బన్నీగారితో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. మంచి ఎంటర్‌టైనింగ్‌ కథ దొరికితే 2022 చివర్లో ఈ సినిమా చేయాలనుకుంటున్నాం. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో అలు ్లఅరవింద్‌గారు మాట్లాడారు. బన్నీ, ప్రశాంత్‌ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ‘పుష్ప’తో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పార్ట్‌ వన్‌ తర్వాత ‘ఐకాన్‌’ ప్రాజెక్ట్‌ ఉంటుంది.

► శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఓ కొత్త సినిమా నిర్మించనున్నాను. రాహుల్‌ రవీంద్రన్‌ ఓ కథ చెప్పారు. గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ సినిమా షూటింగ్‌ త్వరలో తిరిగి ప్రారంభం అవుతుంది. అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ విడుదల గురించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాం.

మరిన్ని వార్తలు