తేదీలు తారుమారు

25 Jul, 2020 01:37 IST|Sakshi

కరోనా వల్ల ఏర్పడ్డ అయోమయం ఇంకా కొనసాగుతూనే ఉంది. థియేటర్ల తాళం ఎప్పుడు తీస్తారో తెలియదు. రిలీజ్‌ డేట్‌ దగ్గరకు వచ్చేకొద్దీ సినిమాలు మరింత దూరం జరుగుతున్నాయి.  ఈ ఏడాది రెండో భాగం కళకళలాడుతుంది అనుకున్న హాలీవుడ్‌ వెలవెలబోయింది. భారీ సినిమాలన్నీ మరోసారి విడుదల తేదీలు తారుమారు అయ్యాయి.

అంతరాయాల అవతార్‌
2009లో వచ్చిన ప్రపంచ బ్లాక్‌ బస్టర్‌‘అవతార్‌’కి ఒకటి కాదు నాలుగు సీక్వెల్స్‌ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్‌ కేమరూన్‌. 2020, 2021, 2022.. ఇలా ఒక్కో సీక్వెల్‌ని ఒక్కో ఏడాది విడుదల చేయాలనుకున్నారు. సీక్వెల్స్‌ చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుంచి  విడుదల ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూనే ఉంది.

లాక్‌ డౌన్‌ తర్వాత షూటింగ్‌ మొదలుపెట్టిన మొదటి భారీ చిత్రం కూడా ఇదే.  అనుకున్న సమయానికే వస్తాం అని నమ్మకం కూడా వ్యక్తం చేశారు. అయితే లాస్‌ ఏంజెల్స్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పని కుదిరేలా లేదని, వాయిదా అనివార్యం అయిందని చిత్రబృందం తెలిపింది. దీంతో ముందుగా అనుకున్న సీక్వెల్స్‌ విడుదల తేదీలన్నీ ఓ ఏడాదికి వాయిదా పడ్డాయి.

స్టార్‌వార్స్‌ ఇప్పట్లో లేనట్టే
బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సిరీస్‌ స్టార్‌ వార్స్‌ ఫ్రాంచైజీలో మరో మూడు సినిమాలను ప్రకటించింది నిర్మాణ సంస్థ డిస్నీ. అయితే ఈ చిత్రాలు కుడా అనుకున్న తేదీ కంటే ఓ ఏడాది వెనక్కి వెళ్లాయి. స్టార్‌ వార్స్‌ కొత్త సిరీస్‌ చిత్రాలకు పేర్లు ఇంకా ప్రకటించలేదు.

వాయిదాల జాబితాలో...
ఈ ఏడాది వేసవిలో టామ్‌ క్రూజ్‌ నటించిన ‘టాప్‌ గన్‌ – మావరిక్‌’ విడుదల కావాల్సింది. కానీ కాలేదు. ఇంకా ‘ఏ క్వైట్‌ ప్లేస్‌’ సీక్వెల్‌ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడింది.

యాక్షన్‌ చిత్రం ‘మూలాన్‌’, క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ‘టెనెట్‌’, వెస్‌ యాండర్‌ సన్‌ తెరకెక్కించిన ‘ఫ్రెంచ్‌ డిస్పాచ్‌’ చిత్రాలు వాయిదా పడ్డాయి. చెప్పిన తేదీకి రావడం లేదంటున్న ఈ చిత్రాల నిర్మాతలు వాయిదా వేసిన తేదీని మాత్రం చెప్పలేదు. మరి.. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్‌ అవుతాయో తెలియదు.. తెరిచాక ప్రేక్షకులు వస్తారా? లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇక విడుదల తేదీ విషయంలో ఏం క్లారిటీ ఇవ్వగలం అంటున్నారు.

జేమ్స్‌ బాండ్‌ ‘నో టైమ్‌ టు డై’ని గత ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. వాయిదా పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుకున్నారు టైమ్‌ కి రాలేదు. ఫిబ్రవరిలోనే ఏప్రిల్‌ కి వచ్చేస్తాం అన్నారు.. అప్పటికి థియేటర్లు మూతపడ్డాయి. ఈ ఏడాది నవంబర్‌కి వస్తాం అంటున్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే మళ్లీ టైమ్‌ తప్పేట్లు ఉంది.

మరిన్ని వార్తలు