ఎన్టీయార్‌ వర్సెస్‌ ఏయన్నార్‌!

17 Jan, 2021 00:53 IST|Sakshi

మరపురాని జ్ఞాపకం

స్టార్ల సంక్రాంతి పోటీ

ఎన్టీయార్‌... ఏయన్నార్‌... ఇద్దరు అగ్ర హీరోలు. సినీ పరిశ్రమకు ఇద్దరూ రెండు కళ్ళు. పలకరింపులున్నా, కలసి పనిచేస్తున్నా – బాక్సాఫీస్‌ వద్ద పోటాపోటీ మాత్రం వదలని ఇద్దరు ప్రత్యర్థి మిత్రులు! సంక్రాంతి లాంటి తెలుగు వారి పెద్ద పండుగకు ఆ టాప్‌ స్టార్ల ఇద్దరి సినిమాలూ ఒకదానిపై మరొకటి పోటీకొస్తే? పైగా, ఆ పోటీపడ్డ సినిమాలు కూడా ఆ హీరోలు స్వయంగా నిర్మించిన సొంత సినిమాలైతే? తెలుగు సినీచరిత్రలో 60 ఏళ్ళ క్రితం ఒకే ఒక్కసారి ఆ ‘క్లాష్‌ ఆఫ్‌ ది టైటాన్స్‌’ జరిగింది. ఆ కథేమిటంటే...

నిజానికి, అగ్రహీరోలు ఎన్టీయార్, ఏయన్నార్‌ల ఇద్దరి సినిమాలూ ఒకే రిలీజ్‌ టైమ్‌లో పోటీపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, సరిగ్గా అరవై ఏళ్ళ క్రితం 1961 నాటి ఆ సంక్రాంతి ప్రత్యేకత – ఆ అగ్రహీరోలు స్వయంగా నిర్మించిన వారి సొంత సినిమాలు ఒక దానితో మరొకటి ఢీ కొట్టడం! ఒకటి – ఎన్టీయార్‌ స్వయంగా నిర్మిస్తూ, నటిస్తూ, దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం ‘సీతారామ కల్యాణం’.  రెండోది – ఏయన్నార్‌ తన సొంత సంస్థ అన్నపూర్ణా పిక్చర్స్‌లో నటించిన సాంఘిక చిత్రం ‘వెలుగు నీడలు’. అలా వారిద్దరి సొంత సినిమాలూ పోటీపడ్డ సందర్భం అదొక్కటే. విచిత్రంగా పోటీపడ్డ రెండు సినిమాలూ సూపర్‌ హిట్టే! రెండూ ఆణిముత్యాలే!! దేని ప్రత్యేకత దానిదే!  

మాతాపిత పాదపూజ...
మెగాఫోన్‌తో ఫస్ట్‌ టైమ్‌...  

‘సీతారామ కల్యాణం’తో ఎన్టీఆర్‌ తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తారు. నిజానికి, ఎన్టీఆర్‌ను రాముడిగా, ఎస్వీఆర్‌ను రావణుడిగా పెట్టి ఈ సినిమా తీయాలనీ, ఎన్టీఆర్‌కు గురుతుల్యుడైన కె.వి. రెడ్డి దర్శకత్వం చేయాలనీ మొదటి ప్లాన్‌. ఈ చిత్రకథ కోసం ఎన్టీఆర్‌ బంధువు, స్నేహితుడైన ధనేకుల బుచ్చి వెంకట కృష్ణ చౌదరి ‘వాల్మీకి రామాయణం’లో లేని అనేక జనశ్రుతి కథలనూ, పురాణ గాథలనూ సేకరించారు. గమ్మత్తైన ఆ అంశాల ఆధారంగా రావణబ్రహ్మ గురించి మరింత తెలుసుకున్న ఎన్టీఆర్‌ ఆ పాత్ర తానే వేయాలని ముచ్చటపడ్డారు. అయితే, వెండితెర శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీనివాసుడిగా ఎన్టీఆర్‌ను మెచ్చిన జనం, ప్రతినాయకుడైన రావణ బ్రహ్మ పాత్రలో ఆయనను చూడలేరని కె.వి. రెడ్డి వాదన. సినీ జీవిత దర్శక గురువు కె.వి. రెడ్డి పక్కకు తప్పుకున్నా, ఎన్టీఆర్‌ వెనక్కి తగ్గలేదు. దర్శకుడిగా ఎవరి పేరూ వేయకుండా, తానే తొలిసారిగా ఆ సినిమా డైరెక్ట్‌ చేసి, జనాన్ని మెప్పించారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నా రు. తల్లితండ్రులకు పాదపూజ చేసి, వారి పాదపద్మాలకు ఎన్టీఆర్‌ తన ఆ తొలి దర్శకత్వ ప్రయోగాన్ని సమర్పించారు. ‘సీతారామ కల్యాణం’ టైటిల్స్‌ చివర సినిమాలో ఆ పాదపూజ దృశ్యం కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ సొంత చిత్రాల్లో తల్లితండ్రులకు పాదపూజ కనిపించేది ఆ ఒక్క చిత్రంలోనే!

సావిత్రి ఆధిక్యానికి శుభారంభం!
‘వెలుగు నీడలు’కు అక్కినేని ఆస్థాన దర్శకుడైన ఆదుర్తి సుబ్బారావే దర్శకుడు. అప్పట్లో ఆదుర్తి వద్ద అసోసియేట్‌ డైరెక్టరైన కె. విశ్వనాథ్‌ ఈ చిత్ర రూపకల్పన, చిత్రీకరణల్లో కీలకభాగస్వామి. ‘వెలుగు నీడలు’కు ముందు దశాబ్దమంతా అక్కినేని – సావిత్రి వెండితెరపై హిట్‌ పెయిర్‌గా వెలిగారు. కానీ, ‘వెలుగు నీడలు’ నుంచి సావిత్రికి ఆధిక్యమిచ్చే కథలు, కథనాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సావిత్రి పోషించే పాత్ర చుట్టూ సినిమాలు తిరగడం, కథలో అక్కినేనికి జోడీగా సైడ్‌ హీరోయిన్‌ ఉండడం కామన్‌ అయ్యింది. తరువాత ఓ దశాబ్ద కాలం పాటు ‘మంచి మనసులు’, ‘మూగ మనసులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘డాక్టర్‌ చక్రవర్తి’ – ఇలా అనేక సినిమాలు ఆ పద్ధతిలో వచ్చాయి. ఆ రకంగా తెలుగు తెరపై సావిత్రి ఆధిక్యాన్ని ప్రజానీకానికి ప్రదర్శించిన తొలి చిత్రం ‘వెలుగు నీడలు’.

ఆ పాటలు... ఆల్‌ టైమ్‌ హిట్స్‌!
‘సీతారామ కల్యాణం’, ‘వెలుగు నీడలు’ – రెండూ మ్యూజికల్‌ హిట్లే. ‘సీతారామ కల్యాణం’లో సముద్రాల సీనియర్‌ రాయగా, గాలి పెంచల నరసింహారావు స్వరపరచిన ‘శ్రీసీతారాముల కల్యాణము చూతము రారండి..’ పాట ఆల్‌ టైమ్‌ హిట్‌. ఎన్టీఆర్‌ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ కల్యాణ గీతం ఇవాళ్టికీ శ్రీరామనవమి పందిళ్ళలోనూ, గుళ్ళలోనూ, పెళ్ళిళ్ళలోనూ మారుమోగుతూ, తెలుగువారి జనజీవితాల్లో భాగంగా నిలిచింది. అలాగే, దేశ స్వాతంత్య్ర దినోత్సవం కానీ, గణతంత్ర దినోత్సవం కానీ వచ్చాయంటే – పెండ్యాల స్వరసారథ్యంలోని ‘వెలుగు నీడలు’లో శ్రీశ్రీ రాసిన దేశభక్తి గీతం ‘పాడవోయి భారతీయుడా...’ ఇప్పటికీ ఊరూవాడా వినపడుతుంది. అలాగే శ్రీశ్రీ రచించిన ఆలోచనాభరిత గీతం ‘కల కానిది..’ కూడా! ఆ మాటకొస్తే ఈ రెండు చిత్రాల్లో ‘వెలుగు నీడలు’ పెద్ద మ్యూజికల్‌ హిట్‌. అందులో శ్రీశ్రీయే రాసిన ‘ఓ రంగయో పూలరంగయో..’, ‘హాయి హాయిగా జాబిల్లి..’,  కొసరాజు రాసిన ‘సరిగంచు చీరెగట్టి..’, కాలేజీ గీతం ‘భలే భలే మంచిరోజులులే..’ లాంటి పాటలన్నీ ఇప్పటికీ వినపడుతూనే ఉంటాయి.                 

విప్లవాత్మక పాయింట్‌...
సంప్రదాయ ట్రీట్‌మెంట్‌...

వెలుగు నీడల వింత కలయిక జీవితం. ప్రతి ఒక్కరికీ సుఖదుఃఖాలు సహజమనీ, వాటిని ధైర్యంగా స్వీకరించాలనీ చెప్పే ‘వెలుగు నీడలు’ చిత్రానికి దుక్కిపాటి, ఆదుర్తి, కె. విశ్వనాథ్‌ కలసి కథ అల్లారు. దీనికి ఆత్రేయ రాసిన మాటలు హైలైట్‌. ‘‘కన్నీరు మానవుల్ని బతికించగలిగితే అది అమృతం కంటే కరువయ్యేది’’ లాంటి ఆత్రేయ మార్కు డైలాగులు ‘వెలుగు నీడలు’లో మనసును పట్టేస్తాయి. నిజానికి, ఆ చిత్రంలో దర్శక, రచయితలు తీసుకున్న విధవా పునర్వివాహం అనే పాయింట్‌ అరవై ఏళ్ళ క్రితం విప్లవాత్మకమైనది. కాలానికి నిలబడిపోయిన కల కానిది.. పాటలో వినిపించే ఆశావాదం ఆ పాయింట్‌నే కథానుగుణంగా, అంతర్లీనంగాప్రస్తావిస్తుంది. హీరో పాత్ర పెళ్ళికి ముందుకొచ్చినా, సావిత్రి నిరాకరిస్తుంది. భర్త (జగ్గయ్య)ను పోగొట్టుకున్న సావిత్రికి అక్కినేనితో పునర్వివాహం చేస్తే, అది ఆ కాలానికి ఓ రివల్యూషనరీ సినిమా అయ్యుండేది. కానీ, ఆనాటి సగటు ప్రేక్షకుల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకొని, సంప్రదాయ ధోరణిలోనే సినిమా కథను దర్శక,రచయితలు ముగించడం గమనార్హం.  

నైజామ్‌లో ఆలస్యంగా...
ఎన్టీఆర్, ఏయన్నార్ల హవా నడుస్తున్న రోజులవి. డిస్టిబ్య్రూటర్లు – ఎగ్జిబిటర్లు విస్తరించిన దశ అది. ఆ సమయంలో సైతం ఈ రెండు చిత్రాలూ గమ్మత్తు గా ఒక్కో ఏరియాలో ఒక్కోసారి రిలీజయ్యా యి. మొదట ఆంధ్ర ప్రాంతంలో జనం ముందుకొచ్చిన ఈ చిత్రాలు, ఆ తరువాత వారం రోజులు ఆలస్యంగా నైజామ్‌ (తెలంగాణ) ఏరియాలో రిలీజయ్యాయి. ‘సీతారామ కల్యాణం’ ఆంధ్రాలో జనవరి 6న వస్తే, తెలంగాణలో జనవరి 14న రిలీజైంది. ఇక, ‘వెలుగు నీడలు’ ఆంధ్రాలో జనవరి 7న విడుదలైతే, తెలంగాణలో జనవరి 12న థియేటర్లలో పలకరించింది.

ఆ రోజుల్లో ఎన్టీయార్‌ ‘సీతారామ కల్యాణం’ 28 ప్రింట్లతో రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు ప్రదర్శితమైంది. ఆ పైన 9 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ శ్రీలక్ష్మీ టాకీస్‌లో 156 రోజులు ఆడింది. జాతీయ అవార్డుల్లో రాష్ట్రపతి యోగ్యతా పత్రం (మెరిట్‌ సర్టిఫికెట్‌) అందుకున్న పౌరాణిక చిత్రంగా నిలిచింది. మద్రాస్‌ ఫిల్మ్‌ ఫ్యాన్స్‌ బ్యాలెట్‌లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికై, ఎన్టీఆర్‌ అవార్డు అందుకున్నారు. ఇక, అక్కినేని ‘వెలుగు నీడలు’ కేవలం 20 ప్రింట్లతో రిలీజైంది. దిగ్విజయంగా 12 కేంద్రాలలో 50 రోజులు, 6 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1961 ఏప్రిల్‌ 16న విజయవాడ అలంకార్‌ థియేటర్‌లో, ఆ మరునాడు రాజమండ్రిలో ‘వెలుగు నీడలు’ యూని ట్‌ సభ్యుల మధ్య శతదినోత్సవాలు జరిపారు.

అప్పట్లో ఈ సినిమాలు రెండింటికీ ప్రత్యేకించి వెండితెర నవలలు రావడం విశేషం. ‘సీతారామ కల్యాణం’ చిత్రరచయిత సముద్రాల సీనియర్‌ కుమారుడైన సముద్రాల జూనియర్‌ ఆ సినిమాకు వెండితెర నవల రాశారు. ఇక, ‘వెలుగు నీడలు’ వెండితెర నవలకు ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ అక్షరరూపం ఇచ్చారు. సంక్రాంతికి అగ్రహీరోలిద్దరి పోటాపోటీలో వచ్చిన ఈ రెండు ఆణిముత్యాలు ఇవాళ్టికీ తెలుగు సినీ ప్రియులకు మరపురానివి! చరిత్ర మరువలేనివి!!
– రెంటాల జయదేవ
తెరపైకి ఫస్ట్‌ టైమ్‌... నాగార్జున
నేటి ప్రముఖ హీరో నాగార్జున పది నెలల పసివా డుగా ఉన్నప్పుడే వెండితెరపై తొలిసారిగా ప్రత్యక్షమైన చిత్రం – ‘వెలుగు నీడలు’. ఆ సినిమాలోని ‘చల్లని వెన్నెల సోనలు..’ పాటలో అక్కినేని, సావిత్రి చేతుల్లో నెలల పిల్లాడైన నాగార్జున కనిపిస్తారు. నిజానికి, ఆ సినిమాలో ఆ పాట చిత్రీకర ణలో వేరే పిల్లాడు పాల్గొనాల్సింది. తీరా ఆ రోజు షూటింగ్‌ టైమ్‌కు ఆ పిల్లాడిని ప్రొడక్షన్‌ వాళ్ళు తీసుకురాలేదు. ఆలస్యమైపోతోంది. అదే సమయంలో అక్కినేని భార్య అన్నపూర్ణ, పసివాడైన నాగా ర్జునను తీసుకొని, షూటింగ్‌ స్పాట్‌కు ఊరకనే వచ్చారు. ఆమె చంకలోని పిల్లాణ్ణి చూసి, నిర్మాత దుక్కిపాటి వగైరా ఆ పాట సీనును నాగార్జునను పెట్టి, చిత్రీకరించేశారు. అలా యాదృచ్ఛికంగా నెలల వయసులోనే నాగార్జున ఫస్ట్‌ టైమ్‌ కెమెరాముందుకు వచ్చేశారు.

కెమేరా మాంత్రికుడి తొలి ట్రిక్‌

‘సీతారామ కల్యాణం’ ద్వారా కూడా ఓ ప్రముఖ సాంకేతిక నిపుణుడు పరిచయమయ్యాడు. ఆ సాంకేతిక మాంత్రికుడు– తాంత్రిక ఛాయాగ్రహణంలో దేశంలోనే దిట్టగా తరువాతి కాలంలో పేరు తెచ్చుకున్న రవికాంత్‌ నగాయిచ్‌. ఎన్టీఆర్‌ ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌ ఎం.ఎ. రెహమాన్‌ రేసుల పిచ్చిలో పడి, ‘సీతారామ కల్యాణం’ ముహూర్తం టైముకు రాలేదు. అప్పటికే చాలాకాలంగా ఒక్క అవకాశం ఇవ్వాల్సిందంటూ ఎన్టీఆర్‌ చుట్టూ నగాయిచ్‌ తిరుగుతున్నారు. ఆ రోజు గేటు దగ్గర కనిపించిన రవికాంత్‌ నగాయిచ్‌ను కారులోఎక్కించుకొని తీసుకెళ్ళి, ముహూర్తం షాట్‌ చేసేశారు ఎన్టీఆర్‌. అలా మొదలైన వారిద్దరి బంధం ‘గులేబకావళి కథ’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘ఉమ్మడి కుటుంబం’, ‘వరకట్నం’ లాంటి అనేక సినిమాల వరకు అప్రతిహతంగా కొనసాగింది. ‘లవకుశ’, ‘వీరాభిమన్యు’, ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతాకల్యాణం’ లాంటి ప్రసిద్ధ పౌరాణిక చిత్రాలకూ నగాయిచే ట్రిక్‌ వర్క్‌ చేశారు. ఆ తరువాత నగాయిచ్‌ పలు హిందీ చిత్రాలకు దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.

నాటకీయ స్వగతానికి నాంది!
‘సీతారామ కల్యాణా’నికి మాటలు, పాటలు రాసిన సముద్రాల సీనియర్‌ తన రచనతో తెరపై ఓ కొత్త ధోరణికి నాంది పలికారు. కథలోని కీలకమైన పాత్ర రంగస్థలం మీది ఏకపాత్రాభినయం ధోరణిలో ధీరగంభీర స్వరంతో తన స్వగతాన్ని తానే పైకి ఆవిష్కరించుకుంటూ, డైలాగులు పలికే ప్రక్రియను సినిమాల్లోకి జొప్పించారు. ‘సీతారామ కల్యాణం’లోని రావణ పాత్రలో ఎన్టీఆర్‌ ఆ స్వగతాభినయం చేశారు. అలా మొదలైన ఆ ధోరణి ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘సంపూర్ణ రామాయణం’ (ఎస్వీఆర్‌), ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘దానవీరశూర కర్ణ’ (ఎన్టీఆర్‌) మీదుగా సాంఘిక చిత్రాల వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సినిమాల్లో ఆ నాటకీయ ఉపన్యాస ఫక్కీని అనుసరిస్తుండడం విశేషం.

మరిన్ని వార్తలు