SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం

4 Jun, 2021 00:24 IST|Sakshi

నేడు యస్పీబీ 75వ జయంతి

సినీ పరిశోధకునిగా, కళాసంస్థ నిర్వాహకుడిగా చాలా మంది సినీ ప్రముఖులతో సన్నిహితంగా మెలిగే భాగ్యం, వాళ్ళ వ్యక్తిత్వాలను అతి దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలిగాయి. అయితే బాలు గారి లాంటి వ్యక్తిని నేను చూడలేదు. పేరెన్నికగన్న గాయకుడిగా కీర్తి గడించినా ఎంతో ఒదిగి ఉండే తత్వం, స్థాయిలకు అతీతంగా అందరినీ గౌరవించే గుణం, నలుగురికీ సాయం చేసే దాతృత్వం, ఓర్పు, సహనంతో మెలగడం ఇవన్నీ వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. ‘సంగమం ఫౌండేషన్‌’ వ్యవస్థాపకుడిగా ఈ రెండు దశాబ్దాలలో నేను చేసిన అనేక కార్యక్రమాలలో బాలు గారు పాల్గొన్నారు.

ప్రఖ్యాత గాయని పి.సుశీల గారు కొన్నేళ్ళ క్రితం ‘పి.సుశీల ట్రస్ట్‌’ను నెలకొల్పి ఆ ట్రస్ట్‌ ద్వారా ఏటా ఒక సింగర్‌ని జాతీయ స్థాయి పురస్కారంతో గౌరవించాలని సంకల్పించారు. తొలి అవార్డును గాయని యస్‌. జానకి గారికి బహూకరించాలనుకున్నారు. అప్పుడు బాలు గారి కచేరీ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో ఆ కార్యక్రమ నిర్వహణ అంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది. రవీంద్రభారతిలో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమం సాయంత్రం అనగా సౌండ్‌ సిస్టవ్‌ు చెక్‌ చేయడానికి  ఉదయం పదకొండు గంటలకే బాలు గారు రవీంద్రభారతికి వచ్చారు.

కొద్ది రోజుల ముందే లక్షలు ఖర్చుపెట్టి పెద్ద సౌండ్‌ సిస్టవ్‌ును రవీంద్రభారతి యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఆ సిస్టవ్‌ును చెక్‌ చేసిన బాలు గారు నాదగ్గరకొచ్చి ‘సంజయ్‌ గారూ! సౌండ్‌ సిస్టమ్‌ ఓకే. కానీ కొత్త సౌండ్‌ సిస్టవ్‌ు కాబట్టి సౌండ్‌ ఆపరేటర్లకు ఆ సిస్టవ్‌ును ఆపరేట్‌ చేయడంలో ఇంకా పూర్తి పట్టు చిక్కినట్లులేదు. సరిగ్గా ఆపరేట్‌ చేయకపోతే మేము, ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. రిస్క్‌ ఎందుకు? మీకు అభ్యంతరం లేకపోతే నా కచ్చేరీలన్నింటికీ రెగ్యులర్‌గా వాడే సౌండ్‌ సిస్టమ్‌నే పిలిపించుకుంటా’ అన్నారు. ‘అలాగే సర్‌’ అని, వారికి రెగ్యులర్‌గా వచ్చే సౌండ్‌ సిస్టమ్‌ వారినే పిలిపించి ఏర్పాట్లు చేశాం. అంతా బాగా జరిగింది.

కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలు గారి దగ్గర కెళ్ళి ‘సౌండ్‌ సిస్టమ్‌ వారికి పేమెంట్‌ ఎంత ఇవ్వాలి సార్‌’ అని అడిగాను. దానికి వారు ‘‘సంజయ్‌ గారూ! ‘రవీంద్రభారతి సౌండ్‌ సిస్టమే వాడతాంగా’ అని సౌండ్‌కు మీరు బడ్జెట్‌ వేసుకొని ఉండరు. సడెన్‌గా నేను వచ్చి ఆ సౌండ్‌ సిస్టమ్‌ను కాదని నాకు అలవాటున్న సౌండ్‌ సిస్టమ్‌ను తెప్పించుకుని దానికి మిమ్మల్ని పేమెంట్‌ ఇవ్వండని అడిగితే మీకెంత ఇబ్బంది! ఇప్పటికిప్పుడు మీరెక్కడి నుంచి తెస్తారు? ఏం ఫరవాలేదు. మీరేమీ ఇవ్వకండి, నేను చూసుకుంటా’’ అని చెప్పి వారే స్వయంగా వారి జేబులోంచి రూ. 15 వేలు తీసి సౌండ్‌ సిస్టమ్‌ వారికి ఇచ్చారు. నాకు నోట మాట లేదు. ఖర్చు పెట్టించేవారినే చూశా కానీ, ఏ సెలబ్రిటీ ఎదురు ఖర్చు పెట్టడం చూడలేదు.

మరునాడు ఉదయం బాలు గారి హోటల్‌ రూమ్‌కి నేను, సుశీల గారు వెళ్ళాం. ‘బాలూ! నేను పాడమని అడగగానే వెంటనే ఒప్పుకుని పాడావు. ఇంత ఇమ్మని ఏమీ అడగకుండానే వచ్చి పాడావు. ఇపుడే ట్రస్ట్‌ ప్రారంభించాం. ఇది నీ స్థాయి రెమ్యూనరేషన్‌ కాకపోయినా అభిమానంతో ఇస్తున్నా ఈ యాభై వేలుంచు’ అన్నారు సుశీల. వెంటనే బాలు చిరుకోపాన్ని ప్రదరిస్తూ, ‘అమ్మా! మీ పాటలు వింటూ పెరిగినవాణ్ణి. మీ పక్కన పాడడంతోనే నా సినీ కెరీర్‌ ప్రారంభమైంది. అలాంటి మీరు ఒక ట్రస్ట్‌ పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తుంటే, మా వంతు సహకారం అందించాలి గాని మీ దగ్గర డబ్బులు తీసుకోవడమేంటి! ఇంకెప్పుడూ ఇలా చేయకండి’ అని తన చేతికిచ్చిన డబ్బుల కవర్‌ను సుశీల గారికిచ్చేసి, ఆమె కాళ్ళకు నమస్కరించారు.

అప్పట్లో ఉడుత సరోజిని అని సీనియర్‌ సినీ గాయనికి ఆరోగ్యం బాగాలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మా సంస్థ తరఫున సన్మానించి, కొంత నగదు ఇచ్చాం. నెల ముందే బాలు గారిని సంప్రతించి, ఆహ్వానించాం. ‘అదే రోజు బెంగళూరులో ప్రోగ్రామ్‌ ఉంది. రాలేను సారీ’ అన్నారు. సరోజిని గారి సన్మానం రోజున మా ఏర్పాట్ల హడావిడిలో మేముండగా సడెన్‌గా బాలు గారి నుండి ఫోన్‌. ‘‘కార్యక్రమం బాగా చేయండి. నేను రాలేకపోతున్నానని బాధగానే ఉంది. అయినా నా మిత్రుడు మురళితో ఓ పాతిక వేలు పంపిస్తున్నా. సరోజిని గారికి నా నమస్సులు తెలియజేసి ఆ మొత్తాన్ని వారికి అందజేయండి’’ అని కోరారు. ఎంతో బిజీగా ఉండే బాలుగారు, వారు రాలేకపోయినా, నెల తర్వాత జరిగే ప్రోగ్రావ్‌ు తేదీని గుర్తుపెట్టుకొని, తన సీనియర్‌ గాయని కోసం బాధ్యతగా పాతిక వేలు పంపడం చూసి మళ్ళీ ఆశ్చర్యపోయా. హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేకపోయా.

ప్రముఖ సితార్‌ విద్వాంసులు జనార్దన్‌ మిట్టా అంటే బాలు గారికి ప్రత్యేకాభిమానం. తను పాడిన తొలి చిత్రం నుండి అనేక వేల చిత్రాలలోని పాటలకు సితార్‌ వాయించిన జనార్దన్‌ గారికి రావాల్సిన గుర్తింపు రాలేదని బాలు గారి భావన. జనార్దన్‌ గారు పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో వారికో ఘన సన్మానం చేసి గౌరవించాలనుకున్నారు బాలు. ఆ కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా చేయమన్నారు. అప్పుడే వరసగా మూడు ప్రోగ్రామ్స్‌ చేసి ఉన్నాము. మళ్ళీ వెంటనే ప్రోగ్రామ్‌ అంటే స్పాన్సర్స్‌ కష్టమేమో అని తటపటాయిస్తూ వారికి విషయం చెప్పా. బాలు వెంటనే అప్పటికప్పుడు తనకు తెలిసిన వ్యాపారవేత్తలకు ఫోన్లు చేసి, స్పాన్సర్‌ చేయించారు.

కార్యక్రమం ముందురోజు బాలుగారు నాకు ఫోన్‌ చేసి ‘‘ఏమండీ! జనార్దన్‌ గారు పెద్దవారు, వారిని మామూలుగా సత్కరించి వదిలేస్తే ఏం బాగుంటుంది. అందుకే స్వర్ణకంకణం తొడిగి గౌరవిద్దామనుకుంటున్నా. చెన్నైలో పనుల ఒత్తిడిలో ఉన్నాను. కంకణం కొనే టైమ్‌ లేదు. ఏమీ అనుకోకుండా ఓ లక్ష రూపాయల్లో మంచి స్వర్ణకంకణం మీరు నా తరఫున షాపింగ్‌ చేయండి’’ అన్నారు. నా దగ్గరున్న డబ్బుతో స్వర్ణకంకణం కొన్నాను. కార్యక్రమం రోజు బాలు దంపతులు తమ ఖర్చులతోనే విమానంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు వచ్చారు.

రవీంద్రభారతికి రాగానే రిసీవ్‌ చేసుకోవడానికి ఎదురెళ్లాను. కారు దిగుతూనే స్వర్ణకంకణం కోసం నేను ఖర్చుపెట్టిన లక్షరూపాయలు నా చేతిలో పెట్టేశారు. అంత పకడ్బందీగా ఉంటారు బాలు గారు. బాలు గారు అంత ఘనమైన సత్కారాన్ని తనకు చేయించడంతో సంతోషంలో సితార్‌ జనార్దన్‌ గారికి వేదికపైనే ఆనందభాష్పాలు రాలాయి. ఓ సాటి కళాకారుడిని ఇంత ఘనంగా గౌరవించే మనసు ఎంతమందికి ఉంటుంది! ఇలా ఎన్నో సంఘటనలు. ఏది ఏమైనా, బాలు గారి లాంటి వ్యక్తులు అరుదు. విశిష్ట వ్యక్తిత్వం వారి సొత్తు.

అమరగాయకుడు ఘంటసాల గారి విగ్రహాన్ని హైదరాబాద్‌లో తన సొంత ఖర్చులతో నెలకొల్పారు బాలు. అలాగే, నెల్లూరులో తమ సొంత ఇంటిని వేద పాఠశాల నిమిత్తం కంచి కామకోటì పీఠానికి డొనేట్‌ చేశారు. మిత్రులెందరినో ఆపదలో ఆదుకున్నారు. లెక్కలేనన్ని గుప్తదానాలు చేశారు.

2020 ఫిబ్రవరిలో చెన్నైలో బాలు గారిని వారింట్లో కలిసినప్పుడు ‘త్వరలో హైదరాబాద్‌ వస్తున్నా. అప్పుడు టైమ్‌ తీసుకుని మీ ఆఫీసు కొచ్చి తెలుగు సినిమాపై మీరు సేకరించిన కలెక్షన్స్‌ అన్నింటినీ తీరిగ్గా చూస్తా. ఏయన్నార్, యస్వీఆర్లపై మీరు వేసిన ఫోటో బయోగ్రఫీ పుస్తకాలు నాకు బాగా నచ్చాయి. ఆ తరహాలో నా మీద కూడా ఒక పుస్తకాన్ని ప్లాన్‌ చేయాలి. అది కూడా మీతో అప్పుడు చర్చిస్తాను’ అన్నారు. అవేమీ జరగకుండానే కరోనా మహమ్మారి బారిన పడి 2020 సెప్టెంబర్‌ 25న బాలు ఈ లోకాన్ని వీడారు. వారితో పాటే నిబద్ధత, సమర్థత, విధేయత, మంచితనం, మానవత్వం కూడా వెళ్ళిపోయాయేమో అనిపించింది.
– సంజయ్‌ కిషోర్, ప్రముఖ సినీ పరిశోధకులు

నేడు యస్పీబీ స్వరనీరాజనం
యస్పీబీ 75వ జయంతి సందర్భంగా ఈ శుక్రవారం తెలుగు సినీపరిశ్రమ అంతా కలిసి ‘స్వరనీరాజనం’ అందిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది వరకూ 12 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో దర్శకులు కె. విశ్వనాథ్, హీరో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, తమ అనుభవాలు పంచుకోనున్నారు. ఆర్పీ పట్నాయక్‌ సారథ్యంలో గాయనీ గాయకులు, సంగీత దర్శకులు పాటలు పాడనున్నారు. జూమ్‌లో జరిగే ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని యూ ట్యూబ్‌లో చూడవచ్చు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు