పైలట్‌గా మారబోతున్న కంగనా రనౌత్‌

20 Nov, 2020 03:06 IST|Sakshi

సినిమాను నడిపేది హీరో. కథలో డ్రైవింగ్‌ సీట్‌ ఎప్పుడూ తనదే. అయితే సినిమాలన్నీ ఆ దారిలోనే కాకుండా వేరే రూట్‌ కూడా తీసుకున్నాయి. స్టీరింగ్‌ సీట్‌ను హీరోయిన్‌కి ఇస్తున్నాయి. కథను గమ్యం వరకు సురక్షితంగా నడిపించగలం అని హీరోయిన్లు నిరూపిస్తున్నారు. ఇప్పుడు గమ్యం ఆకాశం వైపు మారింది. ఆకాశమే హద్దు అయింది. హీరోయిన్లు పైలట్లు అవుతున్నారు. టేకాఫ్‌కి ఆల్వేస్‌ రెడీ అంటున్నారు. ఆ హీరోయిన్ల విశేషాలు.


తొలి లేడీ పైలట్‌
జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌లో ఈ ఏడాది విడుదలైన సినిమా ‘గుంజన్‌ సక్సేనా’. ఫైటర్‌ పైలట్‌ నడిపిన తొలి మహిళ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గుంజన్‌ పాత్రలో జాన్వీ నటించారు. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి హెలీకాప్టర్‌ నడపడం గురించి కొన్ని మెళకువలు తెలుసుకున్నారు జాన్వీ. ఒక పైలట్‌ బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని శిక్షణా తరగతులకు హాజరయ్యారు. జాన్వీ  శ్రమ వృథా కాలేదు. బాగా నటించింది అనే ప్రశంసలు దక్కాయి.

డిసెంబర్‌లో టేకాఫ్‌
‘తేజస్‌’ సినిమా కోసం పైలట్‌గా మారబోతున్నారు కంగనా రనౌత్‌. సర్వేష్‌ మేవార దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘తేజస్‌’. ఇందులో ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌గా కనిపించనున్నారామె. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న సినిమాలోని పాత్ర కోసం కఠినమైన శిక్షణలో ఉన్నారు కంగనా. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ కోసం పెరిగిన బరువు తగ్గిస్తూ, పైలట్‌గా ఫిట్‌గా కనిపించడానికి శ్రమిస్తున్నారు. కంగనా కూడా హెలీకాప్టర్‌ నడిపే క్లాసులకు హాజరవుతున్నారు. ‘‘ధైర్యవంతుల పాత్రను స్క్రీన్‌ మీదకు తీసుకురావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు కంగనా.

కో పైలట్‌
అజయ్‌ దేవగన్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా ‘మే డే’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు ఓ కీలక పాత్రలో అజయ్‌ నటించనున్నారు. ఇందులో రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్నారని గురువారం ప్రకటించారు. అమితాబ్‌ బచ్చన్‌ పైలట్, రకుల్‌ కో పైలట్‌గా కనిపిస్తారు. ‘‘ఈ సినిమా చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. త్వరలోనే శిక్షణ ప్రారంభించి టేకాఫ్‌కి రెడీ అవుతాను’’ అన్నారు రకుల్‌.
పాత్ర ఏదైనా పర్ఫెక్ట్‌ అనిపించుకోవడానికి కథానాయికలు ఇష్టంగా కష్టపడుతున్నారు. హీరోయిన్ల ప్రతిభను ఛాలెంజ్‌ చేసే పాత్రలు మరిన్ని రావాలి. హీరోయిన్ల పాత్రల మీద గీసిన హద్దులన్నీ చెరిపేసేలా దూసుకెళ్లాలి.

మరిన్ని వార్తలు