Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు మెయిల్.. భద్రత పెంచిన పోలీసులు

19 Mar, 2023 21:44 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌కు గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌ నుంచి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. తాజాగా వచ్చిన బెదిరింపులపై సల్మాన్ ఖాన్ బృందం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించిన సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు శనివారం బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో నటుడిని చంపడమే తన జీవిత లక్ష్యమని గ్యాంగ్‌స్టర్ పేర్కొన్నాడు.  ఈ-మెయిల్‌కు సంబంధించిన బెదిరింపులపై గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ-మెయిల్‌లో ఏముంది?

సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి రోహిత్ గార్గ్ అని తేలింది. తాజా బెదిరింపులతో గార్గ్, గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లపై సల్మాన్ ఖాన్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని ఈ-మెయిల్‌లో పేర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారని ప్రస్తావించారు. 

గతంలోనూ బెదిరింపుల లేఖ

గతంలో సల్మాన్‌ ఖాన్‌కు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సల్మాన్ భద్రతను కూడా పెంచింది. తాజాగా బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రకటించాడు. గతంలో సల్మాన్‌ హత్యకు కుట్ర పన్నారని  వార్తలు కూడా వచ్చాయి. సింగర్ సిద్ధూ హత్య తర్వాత కొందరు దుండగులు సల్మాన్‌ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ ద్వారా బెదిరించారు. 
 

మరిన్ని వార్తలు