బిగ్‌బాస్‌ హౌస్‌లో చిచ్చుపెట్టిన ‘నెపోటిజం’

31 Oct, 2020 14:13 IST|Sakshi

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ టాపిక్‌పై తీవ్ర చర్చ నడిచిన సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోల వారసులుతో పాటు కరణ్‌ జోహార్‌ వంటి వారిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ టాపిక్‌ బిగ్‌బాస్‌ రియాలిటీ షో లో కూడా చిచ్చు పెట్టింది. బంధుప్రీతిని కారణంగా చూపిస్తూ.. బిగ్‌బాస్‌ సీజన్‌ 14 కంటెస్టెంట్‌ ఒకరు హౌస్‌మెట్‌ని నామినేట్‌ చేశారు. దాంతో హోస్ట్‌‌ సల్మాన్‌ ఖాన్‌ ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో ఇలాంటి టాపిక్‌  ఎందుకు తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. వివరాలు.. బిగ్‌బాస్‌‌ 14 గత వారం నామినేషన్‌ టాస్క్‌లో భాగంగా రాహుల్‌ వైద్య, జాన్‌ కుమార్‌‌ సనుని నామినేట్‌ చేశాడు. బంధుప్రీతి అంటే తనకు అసహ్యమని.. అందుకే జాన్‌ని నామినేట్‌ చేశానని తెలిపాడు. అంతేకాక జాన్‌కు అంత పాపులారిటీ లేదని.. కేవలం ప్రసిద్ధ సింగర్‌ కుమార్‌ సను కొడుకు కావడం వల్లనే షోలో ఉండగల్గుతున్నాడని విమర్శించాడు. (చదవండి: అవుట్‌సైడర్స్‌కి ప్లస్‌ అదే!)

ఇక ఈ వ్యాఖ్యలపై సల్మాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం  చేసినట్లు తాజా ప్రోమోలు చూస్తే అర్థం అవుతోంది. వీకెండ్‌ షోలో సల్మాన్‌ రాహుల్‌ వ్యాఖ్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ‘ఒకవేళ నా తండ్రి నా కోసం ఏదైనా చేసినట్లయితే.. అది బంధుప్రీతి అవుతుందా’ అంటూ రాహుల్‌ని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత జాన్‌ని ఉద్దేశించి ‘మీ నాన్న నిన్ను ఎన్నిసార్లు రికమెండ్‌ చేశాడు అని ప్రశ్నించగా.. అందుకు జాన్‌ ఒక్కసారి కూడా అలా చేయలేదని’ తెలుపుతాడు. ఆ తర్వతా సల్మాన్‌ రాహుల్‌ని ఉద్దేశించి నెపోటిజం గురించి చర్చించే వేదిక ఇది కాదు అంటూ హెచ్చరించడం చూడవచ్చు. ఇక గత ఎపిసోడ్‌లో రాహుల్ తన ప్రకటనపై విచారం వ్యక్తం చేశాడు.. జాన్‌కి క్షమాపణ చెప్పాడు. జాన్ తల్లిదండ్రులు విడిపోయారనే విషయం తనకు తెలియదని రాహుల్‌ స్పష్టం చేశాడు. జాన్, రాహుల్ క్షమాపణను అంగీకరించాడు, అతను పగ పెంచుకోలేదని తెలిపాడు.

మరిన్ని వార్తలు