అభిమానులకు సల్మాన్‌ ఖాన్‌ విజ్ఞప్తి.. ఈ అత్యుత్సాహం మానుకోండి..

28 Nov, 2021 17:09 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా ఫ్యాన్స్‌.. తమ అభిమాన హీరో సినిమా షోను మొదటి రోజు... మొదటి షోను చూడటానికి ఇ‍ష్టపడుతుంటారు. సినిమా హాల్‌లో పేపర్‌ కటింగ్స్‌, అల్లరి చేయడం, విజిల్స్‌ వేయడం చేస్తుంటారు. మరికొందరు పూలు చల్లుతూ.. ఫ్లెక్సీలపై పాలను పోసి తమ అభిమానాన్ని చాటుకుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే, కొందరు అభిమానులు మాత్రం అత్యుత్సాహాం ప్రదర్శిస్తుంటారు.

తాజాగా ఇలాంటి ఘటన న్యూఢిల్లీలోని స్థానిక సినిమా థియేటర్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కొత్త సినిమా.. ‘ఆంటీమ్‌ దిఫైనల్‌ ట్రూత్‌’ సినిమా విడుదలైంది. ఈ క్రమంలో కొందరు అభిమానులు థియేటర్‌లో క్రాకర్‌లను కాల్చారు. అంతటితో ఆగకుండా.. గట్టిగా కేకలు వేస్తూ పక్కవారికి ఇబ్బందులకు గురిచేశారు.

ఈ హఠాత్పరిణామంతో.. థియేటర్‌కు హజరైన చాలా మంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. థియేటర్లలో ఇలాంటి పనులు చేయకూడదని అభిమానులకు  విజ్ఞప్తి  చేశారు. ఇలాంటి పనులతో.. మీ ప్రాణాలతోపాటు.. తోటివారి ప్రాణాలకు కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు.

అదే విధంగా.. ఫ్యాన్స్‌ క్రాకర్స్‌ తీసుకోని సినిమాహల్లోకి ప్రవేశించకుండా సెక్యురీటి సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కొందరు అభిమానులు ‘ఆంటీమ్‌ దిఫైనల్‌ ట్రూత్‌’ సినిమా ఫ్లెక్సీపై పాలాభిషేకం నిర్వహించారు.

దీనిపై కూడా సల్మాన్‌ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. ‘ కొంత మందికి తాగటానికి సరైన మంచి నీరు దొరకడం లేదు.. మీరు పాలను ఈ విధంగా వృథా చేయకూడదని’ పేర్కొన్నారు. ఈ విధంగా..  పాలను వృథా చేసే బదులు అవసరమైన పిల్లలకు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ట్వీట్‌లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు