Samantha: అరుదైన వ్యాధి.. ఈ పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు

18 Jan, 2023 08:43 IST|Sakshi

సమంతకు ‘మయోసైటిస్‌’.. పూనమ్‌ కౌర్‌కి ‘ఫైబ్రోమయాల్జియా’.. ఇది అందరికీ తెలిసిన విషయమే. మంగళవారం నాడు మమతా మోహన్‌దాస్‌ తాను చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ‘ఈ కష్టాన్నీ దాటేస్తాను’ అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. ఇక సమంత తన అనారోగ్యం గురించి చెప్పినప్పుడు ‘నాలానే ఎంతోమంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’ అన్నారు. ఇదే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచిన పూనమ్, మమతా.. ఈ మధ్యకాలంలో తమ అనారోగ్యం గురించి పేర్కొన్న కొందరు తారల గురించి తెలుసుకుందాం.

గత ఏడాది అక్టోబర్‌లో సమంత తాను మయోసైటిస్‌ వ్యాధి (ఎక్కువ పని చేయలేకపోవడం, కండరాల నొప్పి, త్వరగా అలసిపోవడం వంటివి)తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి బెడ్‌పై ఉండి ఆమె ‘యశోద’ సినిమాకి డబ్బింగ్‌ చెప్పారు కూడా. ‘‘జీవితంలో మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో (మయోసైటిస్‌ని ఉద్దేశించి) ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతదూరం వచ్చానా అనిపించింది. అందుకే పోరాడతా. నాలానే చాలామంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’’ అని పేర్కొన్నారు సమంత.

ఇక సమంత తనకు మయోసైటిస్‌ అని ప్రకటించిన తర్వాత పియా బాజ్‌పాయ్‌ (‘రంగం’ సినిమా ఫేమ్‌) కూడా గతంలో తాను ఇదే వ్యాధితో బాధపడ్డాననే విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇంట్లోవాళ్లు భయపడతారని తనకు మయోసైటిస్‌ అనే విషయాన్ని చెప్పలేదన్నారు పియా. కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉంటున్న పియా వ్యాధి చికిత్స నిమిత్తం ముంబైలో ఉన్నారు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నాక చెప్పానని పియా పేర్కొన్నారు. ఇటీవల ‘లాస్ట్‌’ అనే హిందీ చిత్రంలో నటించారామె. ఇక సమంత తన అనారోగ్యం విషయం బయటపెట్టిన రెండు నెలలకు డిసెంబర్‌లో పూనమ్‌ కౌర్‌ తనకు ‘ఫైబ్రోమయాల్జియా’ అనే విషయాన్ని బయటపెట్టారు.

కండరాల నొప్పి, అలసట, నిద్రలేమితో ఈ వ్యాధి బాధపెడుతుంటుంది. రెండేళ్లుగా ఈ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు తెలిపారు పూనమ్‌. కేరళలో ఆయుర్వేద చికిత్స మొదలుపెట్టిన ఆమె త్వరలోనే కోలుకుంటానని ఈ వ్యాధి గురించి ప్రకటించినప్పుడు తెలిపారు. మరోవైపు గత ఏడాది నవంబర్‌లో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ తాను ‘ఎపిలెప్సీ’ (మూర్ఛ రోగం)తో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే తన వ్యాధి విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా ఉంచడానికి కారణం ఇతరులు తనను బలహీనురాలు అనుకోకూడదని, ఒకవేళ అందరికీ తెలిస్తే తనకు పని ఇవ్వడానికి వెనకాడతారనే భయాలే అని పేర్కొన్నారు ఫాతిమా. కానీ ఇప్పుడు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తన విషయం బయటపెట్టానని స్పష్టం చేశారు.

‘‘నేను షూటింగ్‌ చేస్తున్నప్పుడు మా యూనిట్‌లో ఒకరికి మూర్ఛ వచ్చింది. నేను ఆ వ్యక్తికి సహాయం చేశాను. నాకలా జరిగినప్పుడు ఇతరుల సహాయం కావాలి. అయితే ఇదేం తప్పు కాదు... దాచేయడానికి. అందుకే చెప్పాలనుకున్నాను. నా నిర్మాతలకు నా పరిస్థితి చెబుతుంటాను. లొకేషన్‌లో నాకు మూర్ఛ వచ్చిన సందర్భాలున్నాయి. ఆ టైమ్‌లో  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే చెప్పడం హెల్ప్‌ అయింది’’ అన్నారు ఫాతిమా. ఆమిర్‌ ఖాన్‌ కూతురుగా ‘దంగల్‌’లో ఫాతిమా మల్ల యోధురాలుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు ఫాతిమా. ఇక 2010లో మమతా మోహన్‌దాస్‌ కేన్సర్‌ బారిన పడ్డారు.

ఆ విషయాన్ని బాహాటంగా చెప్పి, ధైర్యంగా చికిత్స చేయించుకున్నారామె. కేన్సర్‌పై అవగాహన కలిగించడానికి పలు విషయాలను పంచుకున్నారు కూడా. అయితే 2013లో మళ్లీ కేన్సర్‌ అని తెలిసినప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నారు. ఇప్పుడు మంగళవారం (17.01.) నాడు తాను చర్మ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని పంచుకున్నారు మమతా మోహన్‌దాస్‌. ‘విటిలిగో’ అనే చర్మ వ్యాధి సోకిందని పేర్కొన్నారామె. చర్మంపై మచ్చలు, చర్మం రంగు మారడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. ఇంకా ‘‘ప్రియమైన సూర్యుడా.. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాను.

నా చర్మం రంగుని కోల్పోతున్నాను. నువ్వు ఉదయించక ముందే నీకోసం నేను నిద్రలేచి పొగమంచులో నీ తొలి కిరణాన్ని చూడటానికి వేచి చూస్తున్నాను. నీ వెచ్చదనాన్నంతా నాకు ఇచ్చెయ్‌. ఎందుకంటే నాకు అది ఎంతో మేలు చేస్తుంది. అందుకే నీకెప్పటికీ రుణపడి ఉంటాను’’ అని మమతా మోహన్‌దాస్‌ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. ‘మీరు పెద్దవే దాటి వచ్చారు. ఇది చిన్న విషయం. ఇందులోంచీ బయటపడతారు’ అని ఫ్యాన్స్‌ పోస్ట్‌ చేశారు. అనారోగ్యం అనే విషయాన్ని బయటపెట్టడానికి ధైర్యం కావాలి. దాన్ని ఎదుర్కొని, కోలుకోవడానికి ఇంకా ధైర్యం కావాలి. ఈ చాలెంజ్‌లో ‘గెలుపు ఖాయం’ అని నమ్మడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ స్టార్స్‌ నిజమైన ‘స్టార్స్‌’. 

మరిన్ని వార్తలు