Sameera Reddy: పదకొండు కిలోలు తగ్గిన నటి!

13 Feb, 2022 03:36 IST|Sakshi

ఆ సమీరా.. ఈ సమీరాయేనా? అనేంతగా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాక సమీరా రెడ్డి బాగా లావయ్యారు. మరీ ఇంత బొద్దుగానా? అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేశారు కూడా. అప్పుడు సమీరా ‘‘తల్లయిన తర్వాత ఎవరైనా బరువు పెరుగుతారు. ‘ఏంటీ లావయ్యారు?’ అని ఎవరైనా అడిగితే ఆత్మన్యూనతాభావానికి గురి కాకూడదు. మన శరీరం.. మనిష్టం’’ అంటూ తల్లయ్యాక బరువు పెరిగి, బాధపడే అమ్మాయిలను ఉద్దేశించి, నాలుగు మంచి మాటలు కూడా చెప్పారు.

అలాంటి సమీరా బరువు తగ్గే పని మీద పడ్డారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం. ఏడాదిలో దాదాపు పది కిలోలు తగ్గారామె. ‘‘గత ఏడాది ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాను. అప్పుడు 92 కిలోలు బరువు ఉండేదాన్ని. ఇప్పుడు 81కి చేరుకున్నాను’’ అన్నారు సమీర. అంటే.. బరువులో పదకొండు పోయే పోచ్‌ అన్నమాట. ఇక బరువు తగ్గడం వల్ల ఎలా ఉంది? ఎలా తగ్గాలో సమీర చెప్పారు.

► బరువు తగ్గాక నా ఎనర్జీ లెవల్స్‌ బాగా పెరిగాయి. అలాగే ఏకాగ్రత పెరిగింది. ఇంతకుముందు కంటే చురుకుగా ఉంటున్నాను. నేను బరువు తగ్గడానికి ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌’ చాలా ఉపయోగపడింది. అంటే.. అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటం, రాత్రిపూట అల్పాహారం తీసుకోవడం వంటిది.

► క్రమం తప్పకుండా చేసిన వ్యాయామాలు నేను తగ్గడానికి బాగా ఉపయోగపడ్డాయి.

► ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటానికి మానసికంగా చాలా కృషి చేశాను. ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ పాజిటివ్‌గా ఉంటాయో అప్పుడు మన శరీరం తేలికగా ఉంటుంది.

► బరువు తగ్గాలనుకుంటే ఏదైనా ఒక ఆటను ఎంచుకోవాలి. ఆటలు ఆడితే ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్‌.. ఫన్‌కి ఫన్‌ దొరుకుతాయి. ∙మన జీవిత భాగస్వామి మన బెస్ట్‌ ఫ్రెండ్‌గా మారి, ప్రతి వారం మన ఫిట్‌నెస్‌ ప్రోగ్రెస్‌ని చెక్‌ చేస్తూ ఉంటే.. మనకు ఆశాజనకంగా ఉంటుంది.

► అమాంతంగా బరువు తగ్గడం ప్రమాదం. ఇన్ని నెలల్లో ఇన్ని కిలోలు తగ్గితే మంచిది అని తెలుసుకుని, మన టార్గెట్‌ అన్ని నెలలపై పెట్టాలి.

► చివరిగా చెప్పేదేంటంటే... మీపై మీరు నమ్మకాన్ని కోల్పో వద్దు. అనవసరంగా ఒత్తిడికి గురి కావొద్దు.

మరిన్ని వార్తలు