పదేళ్లుగా నాకు ఈ స్థాయిలో హిట్‌ మూవీ రాలేదు : సంపత్‌ నంది

12 Sep, 2021 14:53 IST|Sakshi

‘‘హీరో అభిమానులు హ్యాపీగా ఫీలయ్యే సినిమాను తీస్తే ఓ దర్శకుడు గర్వపడతాడు. ప్రస్తుతం నేను ఆ ఫీలింగ్‌లోనే ఉన్నాను. పదేళ్లుగా నాకీ స్థాయిలో హిట్‌ మూవీ రాలేదు. ‘సీటీమార్‌’ విజయంతో ఇటు గోపీచంద్‌ అభిమానుల దాహం కూడా తీరింది’’ అన్నారు సంపత్‌ నంది. గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం ‘సీటీమార్‌’. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది.

ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంపత్‌ నంది మాట్లాడుతూ– ‘‘కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ఇండియాలో థియేట్రికల్‌ రిలీజ్‌లో పెద్ద హిట్‌ అని మా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ఇది ప్రేక్షకుల విజయం. ఈ సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు ఆందోళనకు గురయ్యాను. ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? వస్తే వారి రెస్పాన్స్‌ ఎలా ఉంటుంది? థియేట్రికల్‌ రిలీజ్‌ అంటూ రిస్క్‌ తీసుకుంటున్నామా? ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ మూడు రోజుల్లో... ప్రతిరోజూ నేను గంట కూడా నిద్రపోలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, నార్త్‌ ఇండియాలో కూడా షోలు పడ్డాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఒక్క నెగటివ్‌ కామెంట్‌ కూడా వినపడలేదు. మార్నింగ్‌ షో కాస్త నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత కలెక్షన్స్‌ బాగా పుంజుకున్నాయి.
(చదవండి: ‘సీటీమార్‌’మూవీ రివ్యూ)

కబడ్డీ అనేది మాస్‌ గేమ్‌. ఈ గేమ్‌కు కమర్షియల్‌ అంశాలు జోడించి చెబితే ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకున్నాను. వాళ్లకు నచ్చింది. ఎమోషనల్‌గానూ కనెక్ట్‌ అయ్యారు. అందుకే ‘సీటీమార్‌’ది ప్రేక్షకుల విజయం. గతంలో గోపీచంద్‌తో నేను చేసిన ‘గౌతమ్‌ నంద’ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే డబ్బులు రాకపోయినా పేరొచ్చింది. ఇప్పుడు ‘సీటీమార్‌’కు పేరు, డబ్బులు వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లా డుతూ– ‘‘రచయితగా ‘బ్లాక్‌ రోజ్‌’, ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రాలకు కథలు అందించాను. కథల పరంగా నాకు పదేళ్ల వరకూ కంగారు లేదు. నా దగ్గర అన్ని కథలున్నాయి. నా డైరెక్షన్‌లోని తర్వాతి సినిమాను త్వరలో ప్రకటిస్తాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు