Sanjay Dutt: 'ఆ 10ఏళ్లు రూమ్‌లో లేదా బాత్రూమ్‌లోనే ఉండేవాడిని'

17 Apr, 2022 13:08 IST|Sakshi

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చేసినా కేజీఎఫ్‌-2 పైనే చర్చ నడుస్తుంది. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్‌ ఇచ్చారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమాలో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెస్మరైజ్‌ చేశారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌. ప్రస్తుతం కేజీఎఫ్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఈ సందర్భంగా సినిమా సహా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు డ్రగ్స్‌ ఎలా అలవాటు అయ్యింది అనే విషయాన్ని సైతం షేర్‌ చేసుకున్నారు. 'అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ సిగ్గుపడేవాడిని. కానీ ఎలాగైనా వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడిని. అందులో  భాగంగానే డ్రగ్స్‌ వాడితే అమ్మాయిలకు కూల్‌గా కనిపిస్తానని, వాళ్లతో మాట్లాడే అవకాశం ఈజీగా లభిస్తుందని భావించాను. అలా డ్రగ్స్‌ తీసుకోవడం ప్రారంభించాను.

కానీ ఈ ప్రాసెస్‌లో డ్రగ్స్‌కి బానిసైన నాకు ఆ సంకెళ్లు తెంచుకోవడానిక ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అందరికీ దూరంగా ఒంటరి ప్రపంచాన్ని గడిపేవాడిని. నా జీవితంలో ఆ పదేళ్లు  రూమ్‌లో లేదా బాత్రూమ్‌లో గడిపేవాడిని. షూటింగ్‌లపై ఆసక్తి ఉండేది కాదు. అయితే డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రిహబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లి కొంతకాలం అక్కడే గడిపాను. తిరిగి వచ్చాక అందరూ నన్ను డ్రగ్గీ అని పిలిచేవారు. ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కష్టపడి బాడీని బిల్డ్‌ చేసుకున్నా. దీంతో అప్పటి నుంచి అందరూ ‘క్యా బాడీ హై’అంటూ ప్రశంసించారు' అంటూ చెప్పుకొచ్చారు సంజూ భాయ్‌. 

మరిన్ని వార్తలు