ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు అయిపోయాయి

21 Feb, 2021 00:31 IST|Sakshi

‘‘నేను ప్రయాణించనున్న రోడ్డు చాలా రఫ్‌గా ఉంటుందని నాకు అర్థం అయింది. కానీ దాన్ని దాటేసి మళ్లీ ఎప్పటిలానే పైకి ఎగరాలనుంది’’ అన్నారు నటి సంజనా గల్రానీ. ఇటీవలే శాండిల్‌వుడ్‌ ఇండస్ట్రీలో జరిగిన డ్రగ్స్‌ ఆరోపణల్లో నటి సంజనా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బెయిలు మీద బయటకు వచ్చారామె. ఈ విషయాల గురించి సంజనా మాట్లాడుతూ– ‘‘కొన్ని నెలలుగా నేను ఏడుస్తూనే ఉన్నాను. బహుశా నా కంట్లో కన్నీళ్లు అయిపోయి ఉంటాయేమో? ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా అని దేవుణ్ణి ప్రార్థించాను.

కానీ నాకు ఎదురయ్యే ప్రతీ విషయాన్ని నవ్వుతూ ఎదుర్కొని విజయం సాధించాలనుకుంటున్నాను. మన న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. టైమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’’ అన్నారు. పెళ్లికి గురించి మాట్లాడుతూ– ‘‘నాకు నిశ్చితార్థం అయింది. లాక్‌డౌన్‌లో ఎంగేజ్‌ అయ్యాను. దాన్ని ప్రకటించే వీలు లేకుండా పోయింది. ఇంత జరిగాక నా పెళ్లిని చిన్న వేడుకలా చేసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో పెళ్లి చేసుకుంటాం’’ అన్నారామె. అయితే పెళ్లాడబోయే వ్యక్తి పేరు బయటపెట్టలేదామె. 

మరిన్ని వార్తలు