సంక్రాంతి 2022: స్టార్‌ హీరోల మధ్య పోటీ తప్పదా?

28 Feb, 2021 16:04 IST|Sakshi

వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీలో దిగేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు మన తెలుగు హీరోలు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటిస్తున్న 'సర్కారువారి పాట' సంక్రాంతికి రిలీజ్‌ అవనున్నట్లు చెప్పగా తాజాగా పవన్‌ కల్యాణ్‌ తన 27వ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కూడా సంక్రాంతికి బరిలో దిగుతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. అంటే 2022లో మహేశ్‌, పవన్‌ మధ్య పోటీ గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక సలార్‌ చిత్రంతో ప్రభాస్‌ సైతం సంక్రాంతి పందెంలో అడుగుపెడతాడని కొందరు భావించారు. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ చిత్రయూనిట్‌ ఆదివారం సలార్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న సలార్‌ సినిమా థియేటర్లలోకి వస్తున్నట్లు కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ వెల్లడించారు.

ప్రభాస్‌ సినిమాల విషయానికొస్తే.. ఆయన రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌తో పాటు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నాడు. రాధేశ్యామ్‌ జూలై 30న, ఆదిపురుష్ వచ్చే ఏడాది‌ ఆగస్టు11న రిలీజ్‌ అవుతుండగా సలార్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న థియేటర్లలో సందడి చేయనుంది. సలార్‌లో శృతిహాసన్‌ తొలిసారి ప్రభాస్‌తో జోడీ కడుతోంది. ఇటీవల ‘సలార్’‌ మూవీ ఫస్ట్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ గోదావరిఖని సింగరేణి కోల్‌మైన్స్‌లో జరుపుకోగా.. ప్రభాస్‌ బొగ్గు గనుల్లో బుల్లెట్‌ బైక్‌ నడుపుతూ కనిపించిన ఫొటోలు ఆ మధ్య నెట్టింట చక్కర్లు కొట్టాయి. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 

మహేశ్‌బాబు సినిమాల విషయానికొస్తే అతడు ప్రస్తుతం 'సర్కారువారి పాట' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఇందులో 'మహానటి' ఫేమ్‌ కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తోంది. దుబాయ్‌ షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ సన్నివేశం, ఓ పాట, కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. నెక్స్ట్‌ షెడ్యూల్‌ గోవాలో జరుగుతోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీని తర్వాత మహేశ్‌ 'సరిలేరు నీకెవ్వరు'తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందించిన అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు.

ఇక పవన్‌ కల్యాణ్‌ నటించిన వకీల్‌ సాబ్‌ ఏప్రిల్‌ 9న రిలీజ్‌ కానుంది. మరోవైపు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్‌ 27వ సినిమా చేస్తున్నాడు. దీనికి హరిహర వీరమల్లు అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. నిధి అగర్వాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: కళ్లు చెదిరే పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు