కమెడియన్‌కి జోడీగా హీరోయిన్‌ సురభి.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

16 Apr, 2023 08:27 IST|Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో హాస్యనటుడి నుంచి కథానాయకుడుగా మారిన నటులలో సంతానం ఒకరు. అయితే చాలామంది హాస్య నటుల మాదిరిగా మళ్లీ కామెడీ పాత్రల వైపు వెళ్లకుండా కథానాయకుడుగానే కొనసాగుతూ ఉండటం విశేషం. నిజం చెప్పాలంటే సంతానంకు ఇటీవల సరైన హిట్టు పడలేదు. తను బాణీకి భిన్నంగా ప్రయోగాలు చేయడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే తాజాగా మళ్లీ తన పంథాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన చేతిలో కిక్‌ , వడక్కు పట్టి రామసామి చిత్రాలు ఉన్నాయి. తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం ద్వారా ప్రేమ్‌ ఆనంద్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈయన దర్శకుడు రామ్‌ బాల శిష్యుడు కావడం గమనార్హం. ఈ చిత్రానికి డీడీ∙రిటర్న్స్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. విచిత్ర టైటిల్స్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను, ప్రోమో టీజర్‌ను తమిళ ఉగాది సందర్భంగా విడుదల చేశారు. కాగా నటుడు సంతానం ఇంతకుముందు దిల్లుక్కు దుడ్డు, దానికి సీక్వెల్లో నటించి సక్సెస్‌ సాధించారు. అవి హార్రర్, కామెడీ జానర్లో రూపొందిన కథా చిత్రాలు. కాగా తాజాగా ఈయన తనకు కలిసొచ్చిన అదే నేపథ్యాన్ని ఎంచుకున్నారు.

డీడీ రిటర్న్స్‌ చిత్ర నేపథ్యం కూడా హార్రర్, కామెడీ, థ్రిల్లర్‌నే. కాగా ఇందులో నటి సురభి నాయకిగా నటించనుంది. రెడిన్‌ కింగ్స్‌ లీ, లొల్లుసభ మారన్, మొట్టై రాజేంద్రన్, మునీస్కాంత్, దీనా, బిఫిన్, తంగదురై, దీపా, మానసి తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. దీనిని ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.రమేష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. చిత్రాన్ని ఈ ఏడాది లోనే తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

మరిన్ని వార్తలు