Pandit Shivkumar Sharma Death: ‘సంతూర్‌' శివకుమార్‌ శర్మ కన్నుమూత

10 May, 2022 14:20 IST|Sakshi

ముంబై: ప్రఖ్యాత సంతూర్‌ వాద్యకారుడు, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత పండిట్‌ శివకుమార్‌ శర్మ (84) కన్నుమూశారు. సంతూర్‌ వాయిద్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టడమే కాకుండా అటు సంప్రదాయ సంగీతంలోనూ, ఇటు సినీ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు. మంగళవారం ఉదయం 8– 8:30 గంటల మధ్యలో  శివకుమార్‌ శర్మ గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్టుగా ఆయన సెక్రటరీ దినేష్‌ వెల్లడించారు. కిడ్నీ సంబంధ వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న శర్మ డయాలసిస్‌ మీదున్నారు. 

అయినప్పటికీ ఆయన తనలో ఊపిరి ఉన్నంతవరకు సంతూర్‌ వాద్యనాదంతో అభిమానుల్ని అలరించారు. వచ్చే వారం భోపాల్‌లో ఆయన సంగీత కచేరి కూడా చేయాల్సి ఉన్న సమయంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శివకుమార్‌ శర్మకు భార్య మనోరమ, కుమారులు రాహుల్, రోహిత్‌ ఉన్నారు. మనోరమ, రాహుల్‌ కూడా సంతూర్‌ వాద్యకారులే. తీవ్రమైన గుండెపోటు రావడంతో శర్మ ఉదయం బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుండగా నిముషాల్లోనే ప్రాణాలు కోల్పోయారని, ప్రసిద్ధ సంగీతకారుడు పండిట్‌ జస్‌రాజ్‌ కుమార్తె దుర్గా జస్‌రాజ్‌ చెప్పారు. శివకుమార్‌ శర్మ తనకు రెండో తండ్రిలాంటివారని,, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనని బతికించుకోలేకపోయామంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 1938లో జమ్మూలో జన్మించిన శర్మ సంతూర్‌ పరికరాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తొలి సంగీత కళాకారుడు. 

దేశవ్యాప్తంగా నివాళులు 
శివకుమార్‌ మృతికి దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. సంగీతప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన శర్మ సంతూర నాదం ఇప్పుడు మౌనంగా రోదిస్తోంది అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన సంతాప సందేశంలో పేర్కొంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివకుమార్‌ శర్మ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. రాబోయే తరాలను ఆయన సంతూర్‌ వాద్యం ఆకర్షిస్తుందన్నారు. ఆయనతో తాను గడిపిన సమయాన్ని మోదీ ఒక ట్వీట్‌లో గుర్తు చేసుకున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా తమ మట్టి బిడ్డ అంతర్జాతీయ ఖ్యాతినార్జించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్‌ చేశారు. ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని శివకుమార్‌ శర్మ సంతూర్‌ వాద్యాన్ని యావత్‌ ప్రపంచమే ఆరాధించిందని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెల్లడించారు.  

బాలీవుడ్‌లోనూ హవా
జమ్మూ కశ్మీర్‌కు చెందిన జానపద వాయిద్యమైన సంతూర్‌పై భారతీయ సంప్రదాయ సంగీతాన్ని అద్భుతంగా పలికించి అంతర్జాతీయంగా ఆ వాద్యపరికరానికి శివప్రసాద్‌ ఒక గుర్తింపును తీసుకువచ్చారు. బాలీవుడ్‌ సినిమాల్లో వేణుగాన విద్వాంసుడు పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియాతో కలిసి శివ్‌–హరి పేరుతో సిల్‌సిలా, లమ్హే, చాందిని, డర్‌ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు