ఆ అదృష్టం అందరికి రాదు: సంతోష్‌ శోభన్‌

3 Nov, 2021 09:31 IST|Sakshi

‘‘ఇండస్ట్రీలో ఉండగలననే ఆత్మవిశ్వాసం వచ్చింది కానీ ఇండస్ట్రీలో సెటిలైపోయామనే కాన్ఫిడెన్స్‌ నాకు లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ ఓ కొత్త పర్సన్‌కు చోటు ఉంటుంది. రిలాక్స్‌ అయిపోతే మన అవకాశాలు వేరే వాళ్లకు వెళతాయి. అందుకే ప్రతి రోజూ ఓ పోరాటంగానే భావిస్తాను’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యూవీ కాన్సెప్ట్స్, మాస్‌ మూవీ మేకర్స్, వి సెల్యూలాయిడ్, ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంతోష్‌ శోభన్‌ చెప్పిన విశేషాలు.

⇔ భయం, ఆందోళన నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. భయానికి మన లైఫ్‌లో ఎంత చోటు ఇవ్వాలనే అంశాన్ని వినోదాత్మకంగా చెప్పాం. మారుతి అన్న స్టైల్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఈ సినిమాలోనూ ఉంటుంది. నవ్విస్తూనే ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు.

⇔ నాకు ఓటీటీ, థియేటర్స్‌ అనే  లెక్కలు లేవు. యాక్టింగ్‌లో నాకు టీవీ అయినా ఓకే. స్క్రిప్ట్‌ నచ్చితే సినిమా అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అయినా ప్రాజెక్ట్స్‌ చేస్తాను. నిజానికి సినిమాల్లోకి రాకముందు వెబ్‌ సిరీస్‌లు, వెబ్‌ షో చేశాను. కాకపోతే పెద్దగా ఎవరికీ తెలియదు.

⇔ నాకు కొంచెం సిగ్గు. లిప్‌లాక్‌ సీన్స్‌ నా దృష్టిలో కష్టమైనవి. కానీ నటనలో ఇదో భాగం. ఎంత నార్మల్‌గా, ఎంత ప్రొఫెషనల్‌గా డీల్‌ చేస్తే అంత మంచిది. మారుతిలాంటి దర్శకుడితో చేసినప్పుడు ఏ సీన్స్‌ అయినా ఈజీ అయిపోతాయి. డైరెక్టర్‌ చెప్పింది చేస్తే చాలు.

⇔ మనకు పని లేనప్పుడు మనకు ఇష్టమైన పని దొరికితే అవే మంచి రోజులు. నా లైఫ్‌లో స్ట్రగుల్‌ను కూడా ఎంజాయ్‌ చేసాను. ప్రస్తుతం నందినీ రెడ్డిగారి దర్శకత్వంలో, సుష్మితాగారి ప్రొడక్షన్‌లో, మళ్లీ యూవీ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తున్నాను.

⇔ మా నాన్న (ప్రభాస్‌ ‘వర్షం’ చిత్ర దర్శకుడు శోభన్‌) గురించి ఇండస్ట్రీలో ఉన్న పాజిటివ్‌ వైబ్స్‌ నాపై కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు. నేను డిగ్రీ  ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నప్పుడు యాక్టింగ్‌ చాన్స్‌ వస్తే, వెళ్లమని అమ్మ అన్నారు. నా 23 ఏళ్ల వరకు ఫ్యామిలీని సపోర్ట్‌ చేసేంత డబ్బు సంపాదించలేదు. ఇప్పుడు నా వంతు నేను చేస్తున్నాను. నా బ్రదర్‌ కూడా మంచి యాక్టర్‌... రెండు ప్రాజెక్ట్స్‌ కమిట్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు