Saratha Kumar: నీకు సినిమాలు అవసరమా? అన్నాను, కానీ!: శరత్‌ కుమార్‌

2 Mar, 2023 09:48 IST|Sakshi

తమిళసినిమా: నటిగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఎదుగుదల అనూహ్యం అనే చెప్పాలి. తొలి చిత్రం పోడాపోడీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో వరలక్ష్మీ కెరీర్‌ ఇక అంతే అనే ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆ తరువాత అవకాశాలు రావడానికి చాలా కాలమే పట్టింది. అలాంటి పరిస్థితిని వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కథానాయకిగానే నటిస్తానని ఒక చట్రంలో ఇరుక్కోకుండా ప్రతినాయకిగానూ చాలెంజింగ్‌ పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు. అలాంటి పాత్రల్లో నటించి విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు.

చదవండి: మంచు వారి ఇంట పెళ్లి సందడి షురూ? ఆమెతో మనోజ్‌ పెళ్లి ఫిక్స్‌!

బహుభాషా నటిగానూ రాణిస్తున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ చాలా గ్యాప్‌ తరువాత  కథానాయకిగా తమిళంలో నటించిన చిత్రం కొండ్రాల్‌ పావమ్‌. నటుడు సంతోష్‌ ప్రతాప్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో దర్శకుడు సుబ్రమణ్యం శివ, నటుడు చార్లీ, సెండ్రాయన్,మనోబాల, నటి ఈశ్వరిరావు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి దయాళ్‌ పద్మనాభన్‌ దర్శకత్వం వహించారు. కన్నడంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఈయన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ప్రదాప్‌ కృష్ణ, మనోజ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.

ఈ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. నటుడు శరత్‌కుమార్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వేదికపై అందరూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను నటి విజయశాంతితో పోలుస్తున్నారని, అది నిజమేనని అన్నారు. అయితే మొదట్లో వరలక్ష్మీ నటిస్తానని చెబితే వద్దు అనలేదు గానీ, ముంబై యూనివర్సిటీలో ఎంఏ చదివి సినిమాల్లో నటించడం అవసరమా? అని అన్నానన్నారు. అయితే తను మాత్రం నటించడానికే సిద్ధమయ్యారని, అయితే  ఈ స్థాయికి రావడానికి కారణం తనే అన్నారు.

చదవండి: అభిమాని నుంచి అలాంటి ప్రశ్న, మండిపడ్డ బిగ్‌బాస్‌ బ్యూటీ

బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా స్వశక్తితోనే ఎదిగిందని చెప్పారు. వరలక్ష్మీ బోల్డ్‌ అండ్‌ బ్రేవ్‌ ఉమెన్‌ అని పేర్కొన్నారు. ఒక రోజు రాత్రి ఒక పోలీస్‌స్టేషన్‌ నుంచి ఫోన్‌ వచ్చిందన్నారు. ఏమిటని అడిగితే మీ అమ్మాయి పోలీస్‌స్టేషన్‌లో ఉందని, వరలఓఇ్మ ఇద్దరు వ్యక్తుల్ని కొట్టినట్లు తెలిసిందన్నారు. ఆ వ్యక్తులు వరలక్ష్మి కారును ఢీకొట్టి అల్లరి చేయడంతో తను వారిని చితక బాధినట్లు తెలిసిందన్నారు. అలాంటి ధైర్యశాలి వరలక్ష్మి అని అన్నారు. ఆమె తండ్రిగా తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇక కొండ్రాల్‌ పావం చిత్ర విషయానికి వస్తే  కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తానీ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య థియేటర్‌లోనే చూస్తానని శరత్‌కుమార్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు