Sarkaru Vaari Paata Director: మీడియాతో ‘సర్కారు వారి పాట’ డైరెక్టర్‌, ఆసక్తికర విషయాలు వెల్లడి

2 Apr, 2022 19:14 IST|Sakshi

ప్రేక్షకులకు సర్కారు వారి పాట డైరెక్టర్‌ పరశురాం ఉగాది శుభాకాంక్షలు

Director Parashuram Talks With Media: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’సినిమాను మే 12న విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా దర్శకుడు పెట్ల పరశురామ్‌ వెల్లడించారు. ఆయన కుటుంబ సమేతంగా శ్రీ నూకాలమ్మ తల్లిని శుక్రవారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్బంగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెర్లోపాలెంలోని తన స్వగృహంలో మాజీ సర్పంచ్‌ మాకిరెడ్డి వెంకటరమణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసేందుకు 30 నెలల సమయం పట్టిందన్నారు. కరోనా కారణంగా ముందస్తు ప్రణాళిక కంటే.. అధిక రోజులు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. 

చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్‌ సిగ్నల్‌

విదేశాలు, మన దేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు విశాఖపట్నంలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు. హీరో మహేష్‌బాబు, హీరోయిన్‌ కీర్తి సురేష్‌ అద్భుతంగా నటించారని.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సన్నివేశాలు, పాటలు, డైలాగ్‌లు ఉంటాయన్నారు. నర్సీపట్నంలోని శ్రీకన్య థియేటర్‌లో ఈ సినిమా మొదటి ఆట చూస్తానని వెల్లడించారు. ఇప్పటి వరకు ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించానని.. సోలో చిత్రం పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. గీత గోవిందం, ఆంజనేయులు, యువత, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు సంతృప్తినిచ్చాయన్నారు.  

తాండవ షూటింగ్‌లకు అనుకూలం 
సినిమా షూటింగ్‌లకు విశాఖ జిల్లా ఎంతో అనుకూలమన్నారు. సొంత ప్రాంతంపై మమకారంతో జిల్లాలోని ఏదో ప్రాంతంలో షూటింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఏజెన్సీతో పాటు తాండవ రిజర్వాయర్‌ అందాలు తనను బాగా ఆకర్షించాయన్నారు. ఇటీవల తాండవ రిజర్వాయర్‌ సందర్శించానని చెప్పారు. తమ గ్రామ దేవత జిల్లేడుపూడి బుచ్చేంపేట నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఏటా వస్తానన్నారు. తను ఏ పని తలపెట్టినా.. అమ్మవారిని తలచుకుని ప్రారంభిస్తానని తెలిపారు. అమ్మవారి ప్రాంగణంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం తన భార్యకు చాలా ఇష్టమన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి సినిమాలపై ఉన్న ఆసక్తితో ప్రముఖ సినీ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరానని.. తర్వాత దర్శకుడిగా మారినట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు