నా ఆయుష్షు కూడా ఇచ్చి కాపాడాలి: నటి

20 Aug, 2020 18:41 IST|Sakshi
ఎస్పీ బాలసుబ్రమణ్యం (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కరోనా బారిన పడిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్న విషయం తెలిసిందే. వెంటిలేటర్‌పై ఆయన చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిస్తూ పలువురు సోషల్‌ మీడియాలో వీడియో సందేశాలు పెడుతున్నారు. బాలు ఆరోగ్యంపై అలనాటి సినీనటి సరోజాదేవి కూడా వీడియో ద్వారా సందేశం పంపారు. బాలు ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం)

‘ఇటీవల బాలును ఓ ఆవార్డుల కార్యక్రమంలో కలిశాను. అప్పుడు ఆయనను ప్రతి రోజు ఉదయం తేనె తీసుకుంటున్నారా అని అడగ్గా.. ఆయన దానికి ఎందుకు అని అడిగారు. ఎందుకంటే మీ గొంతు తేనె కంటే మధురంగా ఉంటుంది’ అని ఆయనతో చెప్పాను అంటూ ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన త్వరగా కోలుకొని తిరిగి మళ్లీ పాడాలని ఆశిస్తున్నాను అన్నారు. ‘‘ప్రపంచం మొత్తం ఆయన గురించి ప్రార్థిస్తోంది, మళ్లీ ఆయన పాడాలని కోరుకుంటోంది. భగవంతుడు నా ఆయుష్షుని కూడా బాలుకు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకుని, మరిన్ని పాటలు పాడి అందరినీ అలరించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
(చదవండి: ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు